Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఖగోళ అద్భుతం సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ను వీక్షించడానికి అందరూ సిద్ధమవుతున్నారు. 152 ఏళ్ల తర్వాత కనువిందు చేయబోతున్న సూపర్ బ్లూ బ్లడ్ మూన్ పై ప్రయోగాలు జరిపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్నారు. చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటారు. పౌర్ణమి రోజు ఇది సంభవిస్తుంది. చంద్రగ్రహణం కొన్నిసార్లు పాక్షికంగా ఉంటే కొన్నిసార్లు సంపూర్ణంగా ఉంటుంది. ఇవాళ ఏర్పడబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రుడు పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించడం వల్ల సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సాధారణ చంద్రగ్రహణాల కంటే ఇవాళ్టి చంద్రగ్రహణం చాలా విభిన్నమైనది. మూడు రకాల చంద్రుళ్లను ఒకే సారి చూసే అవకాశమిది. బ్లూ మూన్, సూపర్ బ్లడ్ మూన్ , సంపూర్ణ చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి. ఒకే నెలలో రెండు పౌర్ణములు వస్తే…నెల చివర్లో వచ్చే పున్నమి చంద్రుణ్ని బ్లూ మూన్ అని పిలుస్తారు. ప్రతి రెండేళ్ల 8నెలలకోసారి ఇలా జరుగుతుంది.
భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరిగే క్రమంలో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. అప్పుడు వచ్చే పౌర్ణమి రోజు చంద్రుణ్ని సూపర్ మూన్ అంటారు. సాధరణ పౌర్ణమి రోజులతో పోలిస్తే సూపర్ మూన్ కాస్త పెద్దగా కనిపిస్తాడు. సూపర్ మూన్ కు చంద్రగ్రహణం తోడవడం వల్ల ఎర్రగా రక్తపు వర్ణంలోకి మారి బ్లడ్ మూన్ గా చంద్రుడు అవతరించనున్నాడు. చంద్రగ్రహణం రోజు భూమి వాతావరణం గుండా ఒక్కోసారి సూర్యకిరణాలు చంద్రునిపై పడతాయి. దీనివల్లే చంద్రుడు గోధుమ వర్ణంలోకి మారిపోతాడు. అందుకే ఈ పరిణామాన్ని బ్లడ్ మూన్ గా పిలుస్తారు. బ్లూ, బ్లడ్, సూపర్ మూన్ లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మూడూ కలిసి రావడం అత్యంత అరుదు. ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా వాసులు ఈ పరిణామాన్ని స్పష్ఠంగా వీక్షించేందుకు అవకాశం ఉంది.
భారత్ లో సాయంత్రం 5.20 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం మొదలవుతుంది. 6.25గంటలకు సూర్యాస్తమయం దాటిన తర్వాత ఆకాశంలో తూర్పు వైపు ఈ ఖగోళ అద్భుతాన్ని కనులారా వీక్షించవచ్చు. 7.25వరకు సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఉంటుంది. చంద్రుడు 14శాతం పెద్దగా, 30శాతం కాంతిమంతంగా కనిపిస్తాడు. చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ అవసరం లేదు. కళ్లజోడు వంటివేమీ లేకండా డైరెక్ట్ గానే సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ను చూడవచ్చు. అయితే బైనాక్యులర్స్ వాడితే బాగా స్పష్టంగా కనపడుతుంది. అలాగే చంద్రగ్రహణాన్ని చూడడం అరిష్టమంటూ జ్యోతిష్యులు చెప్పే మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు. గ్రహణం ఖగోళంలో ఏర్పడే ఓ పరిణామం మాత్రమే. దీన్ని చూడడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదు. గ్రహణాన్ని చూడడం వల్ల చెడు జరుగుతుందన్న మాటల్లో ఎలాంటి నిజం లేదు. అదొక మూఢనమ్మకం. ముఖ్యంగా గర్భిణులు గ్రహణం సమయంలో బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని అనాదిగా మన దేశంలో అందరూ నమ్మడం ఓ పెద్ద మూఢనమ్మకమని అనేకమంది రుజువు చేశారు.
ప్రముఖ నాస్తిక వాది గోరాకు తొమ్మిది మంది సంతానం. ఆయన భార్య సరస్వతి గోరా గర్భవతిగా ఉన్న ప్రతి సందర్భంలో సూర్య,చంద్రగ్రహణాల సమయంలో ఇలాంటి మూఢనమ్మకాలేమీ పాటించలేదు. ఆరుబయట అందరిలానే మామూలుగా తిరిగారు. వారి పిల్లల్లో ఎవరికీ గ్రహణం మొర్రిలాంటి లోపాలు రాలేదు. ఇలా ఎంతో మంది గ్రహణం మొర్రిలాంటివి ఉండవని రుజువు చేశారు. అయినప్పటికీ మనదేశంలో ఆ మూఢనమ్మకం తొలగిపోలేదు. జ్యోతిష్యుల కల్లబొల్లి కబుర్లు ఈ మూఢనమ్మకాన్ని పెంచిపోషిస్తున్నాయి. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ విషయంలోనూ జ్యోతిష్యలు ఇలానే వ్యవహరిస్తున్నారు. చంద్రగ్రహణాన్ని చూడకూడదని, కొన్ని రాశుల వారిపై గ్రహణం పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుందని, అనేక కష్టాలు కలుగుతాయని సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడుతున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం జ్యోతిష్యుల మాటలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సూపర్ బ్లూ బ్లడ్ మూన్ ఖగోళంలో జరుగుతున్న అత్యద్భుతమైన, అత్యంత అరుదైన వింత అని, మూఢనమ్మకంతో అలాంటి దృశ్యాన్ని చూడకుండా ఉంటే మంచి అనుభూతిని కోల్పోతారని హెచ్చరిస్తున్నారు.