Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశం మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో వున్నన్ని ప్రాంతీయ మీడియా ఛానెల్స్, పత్రికలు ఇంకెక్కడా కనపడవు. ఇబ్బడిముబ్బడిగా వచ్చిన ఛానెల్స్, పేపర్స్ తో ఇప్పటికే చాలా యాజమాన్యాలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల్లో సహజంగా అయితే ఆ రంగం వైపు కొత్త పెట్టుబడిదారులు కన్ను వేయకూడదు. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. 2019 ఎన్నికలకి తయారవుతున్న పార్టీలు, వాటి మద్దతుదారులు మీడియా ని సమర్ధంగా వాడుకోడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త ఛానెల్స్, రెండు దిన పత్రికలు రంగంలోకి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలోకి అదనంగా ఇంకో దిన పత్రిక చేరినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు దాసరి చేతుల మీదుగా ప్రారంభం అయి ఓ సంచలనంగా నిలిచిన ఉదయం డైలీ ని మళ్లీ పట్టాలు ఎక్కించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీని వెనుక పెద్ద వ్యక్తులే ఉన్నట్టు సమాచారం.
దాసరి బతికి ఉన్నన్నాళ్ళు ఉదయం పత్రిక ని తిరిగి తీసుకురావాలని చాలా సార్లు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు బీజేపీ కి మద్దతుదారుగా వున్న ఓ వ్యాపారవేత్త ఈ పత్రిక తీసుకురావడానికి వున్న అన్ని అవరోధాలని తొలగించి మరీ రెడీ అయిపోతున్నారట. సంపాదకీయ బాధ్యతలు చూసే జర్నలిస్ట్ సహా కీలక నిర్ణయాలు తీసుకునే టీం రెడీగా ఉందట. అన్ని అనుకూలిస్తే సంక్రాంతి తర్వాత ఉదయం చీకట్లని చీల్చుకుని మళ్లీ ఉదయించడానికి సిద్ధంగా ఉంటుంది.