Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ విషయంలో ప్రధాని మోడీ నిర్లక్ష్య వైఖరిని జాతీయ మీడియా ఎదుట చంద్రబాబు ఎండగట్టడంతో… ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడుతున్నారు. చంద్రబాబు మీడియా సమావేశం ముగిసిన వెంటనే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏమేం చేయాలో అన్నీ చేశామని, ఇంకా ఏమేం చేయాలో చేస్తామని, తాము రాజకీయ లబ్దికోసం ప్రయత్నించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని, అభివృద్ధి విషయంలో తాము రాజకీయాలు చేయబోమని, ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లిన తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి కట్టుబడే ఉన్నామని, తాము స్నేహం కంటే భారతప్రజలు, అభివృద్ధికే ఎక్కువ విలువ ఇస్తామని తెలిపారు.
వైసీపీతో బీజేపీ స్నేహం పెంచుకుంటోందంటూ టీడీపీ హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తోందని, అటువంటి ప్రయత్నాలు తాము చేయడం లేదని స్పష్టంచేశారు. తాము గతంలో టీడీపీతో కలిసి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేశామని, ఇప్పుడు టీడీపీ నేతలు కాంగ్రెస్ నేతలను కలుస్తున్నారని విమర్శించారు. అమిత్ షా ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసి అందులో ఏపీకి ఏమేం చేశామో చెప్పారని, అమరావతిలో రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు కూడా తాము సాయం చేస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.