Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుస క్షిపణి ప్రయోగాలు, హైడ్రోజన్ బాంబు పరీక్షతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి కఠిన ఆంక్షలు విధించింది. ఆ దేశ ఇంధన దిగుమతులపై ఆంక్షలు పెట్టడమే గాక, వస్త్రాల ఎగుమతిపై నిషేధం విధించింది. అణ్వాయుధాలు కలిగిన ఉత్తరకొరియాను ప్రపంచం ఎప్పటికీ అంగీకరించదని, ఆ దేశం స్వచ్ఛందంగా అణుప్రయోగాలను ఆపకపోతే… బలవంతంగా ఆపించాల్సి వస్తుందని భద్రతామండలి హెచ్చరించింది. ఈ విషయాన్ని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కే హేలీ తెలిపారు. క్షిపణి దాడులతో తరచూ అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధించేలా అగ్రదేశం పావులు కదిపింది. దీనిపై భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన ఓటింగ్ లో సభ్యదేశాలు కఠిన ఆంక్షలకు అంగీకరించాయి.
అయితే ఉత్తరకొరియా ఇంధన దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని అమెరికా కోరినప్పటికీ… మండలిలోని రష్యా, చైనా మాత్రం దిగుమతులను తగ్గించాలని ఓటు వేశాయి. ఇంధన దిగుమతిలో 30 శాతం మాత్రమే కోత విధించిన భద్రతామండలి వస్త్రాల ఎగుమతిపై పూర్తి నిషేధం విధించింది. ఈ ఆంక్షలు ఉత్తరకొరియాకు తీవ్ర నష్టం కలుగజేస్తాయని భావిస్తున్నారు. ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థకు వస్త్రాల ఎగుమతులు చాలా కీలకం. ఈ ఎగుమతులు ద్వారానే గడచిన మూడేళ్లలో ఆ దేశం 760 మిలియన్ డాలర్లు కూడగట్టుకుంది. ఇప్పుడీ కఠిన ఆంక్షలు నేపథ్యంలో ఉత్తరకొరియా ఎలా స్పందిస్తుందో చూడాలి. భద్రతా మండలిలో తమ దేశానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇప్పటికే ఉత్తరకొరియా పలుమార్లు హెచ్చరించింది.
మరిన్ని వార్తలు: