మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. ఆ చిత్రంలో సాయి పల్లవి తెలంగాణ యాసతో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది. సాయి పల్లవి తెలంగాణ యాస వల్లే ‘ఫిదా’ సినిమా సక్సెస్ అయ్యిందని అందరి అభిప్రాయం. అలాంటి తెలంగాణ యాసతో ఇప్పుడు వరుణ్ తేజ్ వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తొలిప్రేమ’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ బూస్ట్‌తో ప్రస్తుతం వరుణ్ రెండు చిత్రాలు చేస్తున్నాడు. ఆ రెండు చిత్రాల్లో మొదటిది వెంకటేష్‌తో కలిసి ‘ఎఫ్ 2’ టైటిల్‌తో చేయబోతున్నాడు. తాజాగా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.
ఈ చిత్రం మొత్తం కూడా తెలంగాణ జిల్లాల్లో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. పల్లెటూరు మరియు పట్టణం వాతావరణంలో ఈ చిత్రాన్ని చిత్రీకరించబోతున్నారు. తాజా చిత్రంకు సంబంధించిన ఒక ఆన్ లొకేషన్ స్టిల్ సోషల్ మీడియాలో కనిపించింది. ఆ స్టిల్‌లో లుంగీ కట్టుకుని, స్నేహితులతో ఒక పల్లెటూరులో వరుణ్ బాతాకాణి కొడుతున్నట్లుగా ఉంది. అంటే సినిమా ఎక్కువ శాతం పల్లెటూరు నేపథ్యంతో పాటు, తెలంగాణ యాసతో సాగబోతుందని అనిపిస్తుంది. సాయి పల్లవి తెలంగాణ యాసతో మంచి మార్కులు కొట్టేసి, ఆకట్టుకుంది. మరి ఇప్పుడు వరుణ్ తేజ్ ఆ స్థాయిలో మెప్పిస్తాడా లేదంటే విఫలం అయ్యి విమర్శల పాలవుతాడా అనేది చూడాలి. ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.