మహానటి సావిత్రి 1954 లో ఇచ్చిన ఇంటర్వూ- రెండవ భాగం

Veteran Actress Savitri Interview In Kinima Paper In July 1954

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి తెలుగు తెరపై, ముఖ్యంగా దక్షిణాది సినీ రంగంలో చెరగని ముద్రవేసింది ఆమె. నటన పరంగా సావిత్రి ఎన్ని ఉన్నత శిఖరాలు అధిగమించిందో… వ్యక్తిగత జీవితంలో అన్ని కష్టాలు అనుభవించింది అని చెబుతుంటారు ఆమె సన్నిహితులు. సావిత్ర జీవితంలో ప్రేక్షకులకు తెలియని ఎన్నో కోణాలు త్వరలో ఆమె బయోపిక్ ద్వారా రేపు బయటకు రాబోతున్నాయి. అయితే కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా 1954 జూలై “కినిమా” పత్రికలో కొమ్మారెడ్డి సావిత్రి పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ప్రచురించబడ్డాయి. అందులో రెండవ భాగం మీకోసం

ప్రః నటీనటులకు దర్శకుడు ముందుగా కథంతా, చెప్తాడా లేక వారివారి పోర్షన్లకు మటుకే తెలియజేస్తారా ?
జ.కొంతమంది కథ చెపుతారు,మరికొంతమంది పోర్షన్ల వరకే చెపుతారు,మరికొందరు ఏమీ చెప్పరు.
ప్రః మీకు నేను వెనుక ఒక ఉత్తరము వ్రాయగా, దానికి జవాబు వ్రాయకపోవుటకు కారణము తెల్పదరా ఒక ప్రముఖ ఆంగ్ల సినీవార పత్రిక “ ఇంటర్వ్యూ లో  “ సినిమా ప్రేక్షకుల అభీప్రాయములమీదనే ఆధారపడుచుందున. దినమునకు ముప్పదివరకు ఉత్తరములకు సమాధానములిస్తూ యుంటాను అని చెప్పితిరిగదా ఇందులోని ఆంతర్యమేమి?
జః తీరిక ఉన్నంతవరకూ జవాబులు వ్రాస్తూంటాను.
ప్రః పాఠకులు పంపిన సమాధానాలు ఇస్తారా లేక సంపాదకులకు కూడా ఏమైనా బాధ్యత వుంటుందా?
జః ఈ జవాబు నేనే ఇస్తున్నాను.
ప్రః మీరు ఇకమీదట “విజయ”వారి చిత్రాలలో నటిస్తారండి?
జః ఏమండీ అంత సందేహం కలిగింది!
ప్రః మీరు, భానుమతి ఇద్దరు కలిసి నటించిన చిత్రం ఏదైనా వున్నదా అండి?
జః ఇంతకుముందెప్పుడూ నటించలేదు. ఇకముందు నటించనున్నాము.( “మిస్సమ్మ”లో)
ప్రః విజయవారి “చంద్రహారం” లో వలపుపాట వినగానె అన్న పాట మీదేన అండి?
జః కాదు… కోమల పాడింది.
ప్రః “పెళ్ళిచేసిచూడు” లో జోలపాట జి. వరలక్ష్మి , మీరూ కలిసిపాడేరా లేక ఎవరైనా పాడేరా?
జః జి. వరలక్ష్మిగారూ, సరస్వతీ దేవిగారూ పాడారు.
ప్రః మీరూ కృష్ణకుమారీ కలిసి ఎందులోనన్నా నటించారా?
జః ఆ…. నటించాం (“ప్రియురాలు”)
ప్రః మన చిత్రనిర్మాతలలో అనేకులు తమ స్వార్థము కొరకు పనిచేస్తున్నారని కొందరి అభిప్రాయం కొంత వరకూ ప్రజాహితము కొరకే పనిచేస్తున్నారని నా అభిప్రాయం దానికి మీ సమాధానం?
జః రెండిటికీ పనిచేస్తున్నారు.
ప్రః సినిమాలవలన మనదేశపు నవయువతీ యువకులలో ఎట్టి చైతన్యము రేకెత్తినదో తెలుపగలరా?
జః ప్రతీవాళ్ళూ సినిమాలలో చేరాలనే చైతన్యం…
ప్రః మీరు నాగేశ్వరరావుతో ప్రస్తుతము చాలా చిత్రలలో నటించుచున్నారు. కారణం?
జః నిర్మాతలు మమ్మల్నిదద్దర్నీ బుక్ చేయటమే కారణం
ప్రః మీరు నటించిన మొదటి చిత్రం “ సంసారం” అని నేను, కాదని నా స్నేహితుడు వారంచుకుంటున్నాము. యిందులో ఎవరిది తప్పు?
జః మీ స్నేహితుడిది తప్పు.
ప్రః కనకతారలో నటించిన కన్నాంబ మొదటి చిత్రమేది?
జః “కినిమా” వారిని అడిగి తెలుసుకోండి.
ప్రః పార్వతీ మీకు మాటయిచ్చి దేవదాసు మిమ్ముల్ని చేరకుండగానే మరణించాడేం? ఆఖరికి మీ భర్త మీకు దేవాదాసు దర్శనముకూడ లేకుండా చేశాడేం ఎందుకో తెలియజేస్తారా?
జః ఈ సందర్భంలో శరత్ చంద్రబాబు వుంటే ఎంత బాగుండేది.
ప్రః మీరు “పెంపుడు కొడుకు” చిత్రములో బావిదగ్గర పూలచెట్లకు నీరుపోయుచు, పాడినపాట హిందీ చిత్రము “ఆన్ లోని పాటను అనుకరించినట్లు తలుస్తాను. నిజమేనా
జః నిజమే.
ప్రః మీరు హిందీ చిత్రములలో గొప్ప నటీమణుల నటనను చూచి అలాగే, అనుకరిస్తూ నటిస్తారని విన్నాను నిజమేనా?
జః అలాంటి అలవాటు లేదు.
ప్రః నీకెట్టి పాత్రయనిన అభిమానము మెండు?
జః శక్తి సామర్థ్యాలుగల ఏ పాత్రనైనా అభిమానంతో నటిస్తాను.
ప్రః అట్టిపాత్ర నీ విప్పటివరకు వేసిన ఏ చిత్రములోనైనా గలదా?
జః కలదు
ప్రః సినీనటులు రాజకీయవేత్తలయి, రాజకీయవేత్తలు సినీ నటులయినచో నప్పుడు భావి భారత పరిస్థితి యెట్టుండును.
జః తలక్రిందులుగా నుండును
ప్రః మీ నటీనటులకు డబ్బు విలువ, కష్టములనుభవించుట సహనము మొదలగునని తెలియునా?
జః తెలియును.
ప్రః నీవు వేసిన చిత్రములలో నేవేవి శతదినోత్సవములు చేసుకొన్నవి?
జః “పెళ్ళిచేసిచూడు”, “దేవదాసు,” “బ్రతుకుతెరువు,” “ప్రతిజ్ఞ”.
ప్రః “కినిమా” గురించి మీ అభిప్రాయమేమిటి సెలవిస్తారా?
జః మంచి ఆదర్శాలుగల పత్రిక.
ప్రః మీ ఆటోగ్రఫీ తీయించి పంపుతారా?
జః ఆటోగ్రఫీ తీయించడం ఏమిటి సోదరా?
ప్రః మీకు వివాహము జరుగక మునుపే మీ చెల్లిగారైన మారుతి వివాహము చేసుకొనుటకు కారణమేమి?
జః మారుతి మా చెల్లికాదు… ఆమె మా అక్కయ్య.
ప్రః యువరాజు వేషమునకు ఎన్. టి రామారావు తగినవారని నా ప్రియమిత్రుడు కె. రామమూర్తి రెడ్డియు, ఏ. నాగేశ్వరరావు తగినవారని నా ప్రియసోదరుడు టి. రామచంద్రారెడ్డియు వాదములాడుచున్నారు. అందులకు నేను వారి పర్సనాలిటీని చూచి వారికి యిష్టమైన వారికి తీసుకొందురని నా అభిప్రాయము చెప్పితిని. ఇందులో మీరు ఎవరితో ఏకీభవిస్తారు.?
జః మీతో ఏకీభవిస్తాను.
ప్రః మేము మీతో కలసి మాట్లాడవలసియున్నది. మేము మీ యింటికి వచ్చిన గౌరవించెదరా? అగౌరవించెదరా? మీ అడ్రసు తెలిపవలసినదిగా కోరుచున్నాను?
జః అగౌరవించే అలవాటు నాకు లేదు. తప్పకుండా మీతో మాట్లాడతాను. అడ్రసు 11, వైద్యరామయ్యర్ వీధీ, త్యాగరాయనగర్, మదరాసు -17
ప్రః ”దేవదాసు” చిత్రంలో పాత్రను మీరు పోషించలేక పోయారు. భావాలను వ్యక్త పరచడంలో చాలా లోపాలున్నాయ్. తప్పు మీదా లేక దర్శకునిదా?
జః తప్పు నాదే కావచ్చు.
ప్ర.మీరెంతవరకు చదువుకున్నారు? మీకు వ్రాయను,మాట్లాడను ఎన్ని భాషలొచ్చు?
జః థర్డ్ ఫారం వరకు చదువుకున్నాను.తెలుగు,తమిళం,హిందీ మాట్లాడటంవచ్చు.

గమనిక : 1954 జూలై “కినిమా” పత్రికలో కొమ్మారెడ్డి సావిత్రి పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ప్రచురింపబడింది. ఆ పత్రికలో ప్రచురించిన ప్రశ్నలు-జవాబులు యధాతధంగా మీకు ఇవ్వటం జరిగింది. ఈ ప్రశ్నలు జవాబులు అన్నీ మాహనటిసావిత్రి.కాం నుండి తీసుకుని పాటకుల సౌలభ్యం కోసం ఇవ్వబడ్డాయి. కొన్ని ప్రశ్నలకు సావిత్రి ఇచ్చిన జవాబులు చూస్తే ఎంత తమాషాగా, తెలివిగా ఆమె మాట్లాడేదో అర్దమవుతుంది. మాహనటి సినిమా విడుదల సందర్భంగా ఆమె అభిమానులకి ఇవ్వగలిగే చిరు కానుక ఈ ఇంటర్వ్యు.

ఆమె పాటకులకి ఇచ్చిన సమాధానల లిస్టు పెద్దదిగా ఉండడంతో మేము రెండు భాగాలుగా ప్రచురిస్తున్నాము గమనించగలరు.
Content Credits : http://www.mahanatisavitri.com/newposts/kinemainterview/