విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రం కోసం వాట్ ద ఎఫ్ అంటూ పాట పాడిన విషయం తెల్సిందే. ఆ పాటలో మహిళలను కించపర్చే విధంగా పదాలు ఉన్నాయని, అలాగే రాముడిని సీతను కించపర్చే విధంగా సాహిత్యం ఉంది అంటూ విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ వివాదం పెద్దది కాస్త పెద్దది అవ్వడంతో చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే పాటను సోషల్ మీడియాతో పాటు అన్ని ఫ్లాట్‌ఫారమ్స్ నుండి తొలగించారు. తాజాగా వివాదాస్పదం అయిన పదాల స్థానంలో కొత్త పదాలను జత చేసి పాటను విడుదల చేయడం జరిగింది. మళ్లీ కూడా విజయ్ దేవరకొండ పాడటం జరిగింది.
వాట్ ద లైఫ్ అంటూ సాగే పాటను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పాటను నేను మళ్లీ పాడను. అయితే మీరు ఈ పాటను పాడి మాకు పంపిస్తే నా కంటే బాగా మీరు పాడారు అనిపిస్తే తప్పకుండా మీతోనే ఆ పాట మళ్లీ పాడివ్వడం జరుగుతుంది. మీరు పాడిన పాటను సినిమాలో పెడతాం అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి వివాదం అయిన పాటతో కూడా పెద్ద ఎత్తున సినిమాకు విజయ్ దేవరకొండ పబ్లిసిటీ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. భారీ ఎత్తున ఈ చిత్రంపై అంచనాలున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో ఇలా విభిన్నంగా పబ్లిసిటీ చేయడం వల్ల యూత్‌లో మరింతగా ఈ చిత్రాన్ని తీసుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విజయ్ దేవరకొండకు మరో బ్లాక్ బస్టర్‌ను ఇస్తుందనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ‘మహానటి’ చిత్రంలో మంచి పాత్రతో మెప్పించిన విజయ్ ఇప్పుడు గోవిందంగా అలరిస్తాడని అంతా భావిస్తున్నారు.