తన యాటీట్యూడ్తో, రౌడీని అంటూ యూత్‌ను ఊపేస్తున్న విజయ్ దేవరకొండ ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆశించినంతగా సంతృప్తి పరచలేకపోయాడు. మొదటి వారంలో ఈ చిత్రంపై ఒకింత క్రేజ్ ఉన్నా కూడా ఆ తర్వాత కలెక్షన్ల విషయంలో వెనుకపడి పోయింది. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తమిళనాడులో తన సత్తా చాటాలనుకున్నాడు. అందుకే తమిళ బ్యాక్రౌండ్తో ‘నోటా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అక్కడ కూడా ఈ చిత్రం పెద్దగా ఆడలేకపోయింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన అభిమానుకు మరియు యాంటీ ఫ్యాన్స్‌కు ఓపెన్ లెటర్ రాశాడు.
ఓపెన్ లెటర్లో… ‘నోటా’ ను ఆదరించిన ప్రేక్షకుల ప్రేమను స్వీకరిస్తున్నానని అదేవిధంగా ఇది నచ్చని వారి కామెంట్లని కూడా సీరియస్‌గా తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ‘నోటా’ పరాజయం భాద్యత అంతా తనదేనని, ఇంకోసారి ఇలా జరగదని, అతి త్వరలోనే మంచి సక్సెస్‌తో మీ ముందుకు వస్తాను అంటూ అభిమానులకు అభయహస్తం ఇచ్చాడు. ఇకపోతే యాంటీ ఫ్యాన్స్‌ని ఈ సందర్భంగా పండగ చేసుకోమని, మళ్లీ ఇలాంటి సందర్భం రాదని ఓపెన్‌గా చెప్పాడు. రౌడీలు ఒక్క పరాజయంతోనే నిరాశ పడిపోరు, రౌడీ అంటే కేవలం గెలవడమే కాదు, గెలుపుకోసం పోరాడే వారే రౌడీలు అంటూ చాలా ఓపెన్‌గా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అతి త్వరలోనే సక్సెస్‌తో మీ ముందుకు వస్తానన్న విజయ్ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.