Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మహానటి సినిమాకు సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులూ నీరాజనం పడుతుండగా…జెమినీగణేశన్ మొదటి భార్య అలిమేలు పెద్ద కుమార్తె, ప్రముఖ డాక్టర్ కమలా సెల్వరాజ్ మాత్రం అభ్యంతరం వ్యక్తంచేయడంపై సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి స్పందించారు. మహానటిలో తన తండ్రిని విలన్ లా చూపించారని కమల ఆగ్రహం వ్యక్తంచేశారు. సావిత్రికి తన తండ్రి అంటే ఇష్టం లేదని, తండ్రితో కలిసి ఒకసారి తాను సావిత్రి ఇంటికి వెళ్తే తమపైకి కుక్కలను ఉసిగొల్పిందని కూడా కమల ఆరోపించారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్ లా తన తండ్రి కూడా తమిళంలో ఎంతో పేరున్న హీరో అని, చివరి దాకా ఆయన సినిమాల్లో నటిస్తూనే ఉన్నారని, అలాంటిది ఆయన అవకాశాల్లేకుండా ఖాళీగా ఉన్నట్టు చూపించారని మండిపడ్డారు. ఒకరి జీవితం గురించి పూర్తిగా తెలుసుకోకుండా సినిమా తీసేయడం సబబు కాదన్నారు.
అక్క కమల విమర్శలను విజయ చాముండేశ్వరి సహజమైనవిగానే భావిస్తున్నారు. మహానటి సినిమాను తాను తన తల్లి కోణం నుంచి చూశానని, అక్క కమల మరో కోణంలో చూసి ఉంటారని విజయ అభిప్రాయపడ్డారు. ఇందులో తన అక్క తప్పేమీలేదని, ఇవి అభిప్రాయ బేధాలు మాత్రమేనని, ఆమెకు సినిమా మరోలా అర్ధమై ఉంటుందని విజయ చాముండేశ్వరి వ్యాఖ్యానించారు. సినిమాలో చూపించినట్టు నాన్న అమ్మను ఎంతగానో ప్రేమించారని, ఈ సినిమా వల్ల తనకు, కమలకు మధ్య ఎలాంటి విభేదాలు రావని ఆమె చెప్పారు. సినిమాలో చూపించినట్టు అమ్మకు తాగుడు అలవాటు చేసింది నాన్న కాదన్న విషయాన్ని ఒప్పుకుంటానన్నారు. అమ్మ చిత్ర పరిశ్రమకు చెందినవారు కాబట్టి ఆమెకు మద్యం అలవాటయిందని, సినిమాలో అమ్మ నాన్నతో కలిసి మద్యం సేవిస్తున్నట్టు చూపించారని, కానీ ఆమె మద్యం తాగడం అది మొదటిసారేంకాదని విజయ చాముండేశ్వరి తెలిపారు. తన తండ్రి నుంచి తనకు దొరికిన అపురూపమైన కానుకలు తన అక్కాచెల్లెళ్లని, ఎట్టిపరిస్థితుల్లోనూ వాళ్లను వదులుకోనని విజయ చెప్పారు. పెద్దమ్మ అలిమేలు గొప్ప మెంటార్ అని, తండ్రి కుటుంబమే తన కుటుంబమని ఆమె స్పష్టంచేశారు.