Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చాన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ..కొన్ని కార్యక్రమాలకు కలిసి హాజరై సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. తాజాగా వాళ్లిద్దరూ టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ రిసెప్షన్ కు జంటగా హాజరై ఆడిపాడారు. ఈ నెల 23న బాలీవుడ్ నటి సాగరికను నిరాడంబరంగా వివాహం చేసుకున్న జహీర్ ముంబైలోని తాజ్ ల్యాండ్స్ లో రిసెప్షన్ ఏర్పాటుచేశాడు. ఈ వివాహ విందుకు సచిన్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సానియా మీర్జా, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్ తో పాటు పలువురు మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో విరుష్క జోడీ అందరిమధ్యా కలియతిరుగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నూతన జంటతో కలిసి వారిద్దరూ డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలు చూస్తూ నెటిజన్లు కోహ్లీ, అనుష్క కూడా త్వరలో పెళ్లిపీటలెక్కాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వారిద్దరి వివాహానికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారని, డిసెంబరులో పెళ్లి ఉంటుందని వార్తలొచ్చాయి. పెళ్లికోసమే కోహ్లీ శ్రీలంక సిరీస్ నుంచి విశ్రాంతి కోరాడనీ భావించారు. అయితే దీనిపై అటు కోహ్లీ కుటుంబ సభ్యులు కానీ, ఇటు అనుష్క కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.