నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్స్‌పై తనదైన శైలిలో విరుచుకు పడ్డ శ్రీరెడ్డి తాజాగా తమిళ స్టార్స్‌పై ఆరోపణలు చేస్తూ వస్తుంది. మురుగదాస్, హీరో శ్రీకాంత్, లారెన్స్‌లపై ఈమె తీవ్రమైన ఆరోపణలు చేయడంతో పాటు, తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఏకంగా చెన్నై వెళ్లింది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి మూడు రోజుల పాటు అక్కడ ఉండబోతున్నట్లుగా ప్రకటించింది. శ్రీరెడ్డి చేస్తున్న విమర్శలకు తమిళ సినీ పరిశ్రమలో కుదుపు మొదలైంది. ఇప్పటికే కొందరు మురుగదాస్ మరియు లారెన్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ వివాదంపై ఒక క్లారిటీని తీసుకు వచ్చేందుకు విశాల్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్ తమిళ సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కరించేందుకు రంగంలోకి దిగుతాడు. అదే విధంగా శ్రీరెడ్డి విషయంలో కూడా విశాల్ ఇన్వాల్వ్ అయ్యేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం మురుగదాస్‌తో పాటు లారెన్స్ మరియు శ్రీకాంత్‌తో భేటీ అయ్యి ఆ తర్వాత శ్రీరెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న కారణంగా ఆమెను కలుసుకోవడం సులభం అని, అక్కడ ఆమెతో మాట్లాడి వివాదానికి ఒక ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంది. చెన్నై పోలీసులను శ్రీరెడ్డి కలవకముందే విశాల్ ఆమెను కలవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి శ్రీరెడ్డి విశాల్‌ను కలిసేందుకు ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి. ఒక వేళ శ్రీరెడ్డిని కనుక విశాల్ కలిస్తే సంచలనం కావడం ఖాయం అంటున్నారు.