హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొందరు పార్టీ నేతలతో కలిసి ఈనాడు సంస్థల అధినేత రామోజీని కలవడం మీద ఇప్పుడు విస్తృత చర్చ సాగుతోంది. “సంపర్క్ సమర్ధన్” కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖుల్ని కలిసి ప్రధాని మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తున్నారు అమిత్ షా. ఇప్పుడు రామోజీతో భేటీ కూడా అలాంటిదే అని తెలుస్తున్నప్పటికీ అంతకు మించినది ఏదో వుంది అని వైసీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియా సందేహపడుతోంది. బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్యకు మరో సారి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు.
ఇంకొందరు ఈనాడు మీడియాలో బీజేపీ వ్యతిరేక వార్తలు రాకుండా చూడాలని అమిత్ షా కోరినట్టు వార్తలు పుట్టిస్తున్నారు. ఇందులో ఏది నిజమో ముఖాముఖీ చర్చల్లో పాల్గొన్న ఆ ఇద్దరే చెప్పగలరు. కానీ …అది జరిగే పని కాదు.
అమిత్ షా , రామోజీ భేటీ మీద ఈకలు పీకుతున్న వైసీపీ నాయకులు ఓ విషయం మర్చిపోయినట్టు వున్నారు. ఒకప్పుడు సాక్షి తో పోలిస్తే ఈనాడు ధర ఎక్కువ ఉందని పరోక్ష యుద్ధం నడిపిన జగన్ కూడా 2014 ఎన్నికల్లో తగిలిన షాక్ తో కళ్ళు తెరుచుకున్నారు. మీడియా అంటే సాక్షి మాత్రమే కాదని అర్ధం చేసుకుని ఏ రామోజీ మీద అయితే యుద్ధం ప్రకటించారో అదే రామోజీ వద్దకు వెళ్లి తన రాజకీయ ప్రయాణానికి ఆశీస్సులు కావాలని కోరారు. నిజానికి అప్పుడున్న పరిస్థితుల్లో రామోజీ నిర్వహణలో జగన్ వార్తల ప్రాబల్యం పెరుగుతుందేమో అని చాలా మంది భావించారు.
ఈనాడు ని అభిమానించే వాళ్ళు కూడా ఎక్కడో సందేహించారు. కానీ రామోజీతో జగన్ భేటీ ఓ మర్యాదపూర్వక వ్యవహారంగానే మిగిలిపోయింది. ఈనాడులో విధానపరమైన మార్పులు ఏమీ రాలేదు. ఈ విషయం స్వానుభవంలోకి వచ్చిన తర్వాత కూడా అమిత్ షా తో భేటీని అడ్డం పెట్టుకుని రామోజీని తక్కువ చేద్దాం అనుకుంటున్న వైసీపీ అనుకూల మీడియాని చూస్తే జాలేస్తోంది. చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడుతున్న వారి అభద్రతాభావాన్ని చూసి నవ్వొస్తోంది.