Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాస్త పేరు ప్రఖ్యాతులు రాగానే వెర్రిమొర్రి వేషాలు వేసే బ్యాచ్ లో ఈ మధ్య కొందరు జ్యోతిష్యులు కూడా చేరిపోయారు. రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పెద్ద జ్యోతిష్య కేంద్రం పెట్టిన ఓ పంతులుగారు అక్కడికి వచ్చిన మహిళల్ని తన లైంగిక అవసరాలకి వాడుకుని, డబ్బులు కూడా కొట్టేసి ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్న విషయం తెలిసిందే. ఇక జ్యోతిష్యాన్ని కొత్త పుంతలు తొక్కిచ్చానంటూ సినిమా, రాజకీయం గురించి యు ట్యూబ్ ఛానల్ లో జ్యోతిష్యం చెప్పిన వేణు స్వామి గుర్తున్నారా ? ఈయన గారి పాండిత్యం ప్రధాని మోడీ దాకా వెళ్లిందని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. ఓ ఎంపీ గారు ఇచ్చిన విజిటర్ పాస్ పట్టుకుని పార్లమెంట్ ప్రాంగణం లోకి అడుగు పెట్టినందుకు ఆయన చేసిన హడావిడి అంతాఇంతా కాదు.మాములుగా అయితే జ్యోతిష్కులు తమ దగ్గరికి వచ్చే వారికి రాబోయే సమస్యలు, వాటి పరిష్కారాలు చెబుతారు.
కానీ ఈ వేణు స్వామి మాత్రం జనం ఎప్పుడు దేని గురించి , ఏ వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడుతారో దాని గురించి మాత్రమే చెబుతారు. హాట్ టాపిక్ మీద జోస్యం చెబుతూ దాన్ని షూట్ చేసి యు ట్యూబ్ ఛానల్ లో పెట్టేస్తారు. అంత మాత్రానికే ఈయన జోస్యంలో కొత్త ఒరవడి అంటూ గప్పాలు బాగానే కొట్టారు. అయితే ఈ స్వామిజీ ఏ టాపిక్ మీద నేరుగా అభిప్రాయాలు చెప్పకుండా జాగ్రత్తపడతారు. ఇక తాను అభిమానించే సెలెబ్రెటీలకు అనుకూలంగా, నచ్చని వాళ్లకి వ్యతిరేకంగా ఏదేదో చెప్పేస్తుంటారు. హాట్ టాపిక్ మీద ఆసక్తితో జనం కూడా అయ్యగారి జోస్యాన్ని యు ట్యూబ్ లో ఫాలో అయిపోయేవాళ్లు.
యు ట్యూబ్ ఫాలోయింగ్ ఉచ్చులో పడి ఈమధ్య వేణు స్వామి రెండు కీలక విషయాల్లో చెప్పిన జోస్యం తప్పు కావడంతో ఆయన జాతకమే మారిపోయింది. నంద్యాల ఎన్నికల గురించి చెబుతూ వైసీపీ గెలుస్తుందని నేరుగా చెప్పకుండా టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే కాలేడని చెప్పారు. ఈయన గారి మీద నమ్మకంతో చాలా మంది బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకుని ఆ కసితో ఈయనకు ఫోన్ చేసి బాగానే అక్షింతలు వేసారట. ఇలా పోయిన పేరుని తిరిగి తెచ్చుకోడానికి అన్నట్టు మళ్ళీ బిగ్ బాస్ గురించి ఓపెన్ అయ్యారు. శివబాలాజీకి అసలు గెలిచే అవకాశమే లేదన్నారు. శివబాలాజీ గెలిచాడు. దీంతో ఈయన గారి జాతకమే తిరగబడింది. బిగ్ బాస్ ప్రభావం అయ్యగారి జ్యోతిష్క బేరం మీద బాగానే పడిందట.