భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి మద్దతుగా నిలబడింది. ఇప్పటికే బీజేపీ వైసీపీలు రహస్య ఒప్పందాలు చేసుకున్నాయి అని టీడీపీ ఆరోపిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశమవుతున్న జమిలీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఈ విషయంపై అభిప్రాయాలు కోరిన “లా కమిషన్” చైర్మన్ తో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు ఢిల్లీలో సమావేశమయ్యారు. తమ పార్టీ అభిప్రాయాలను వారు లేఖ రూపంలో వివరించారు. కేవలం ఒక్కసారి మినహా ఎప్పుడైనా కేంద్రంతో సహా ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికలు జరుగుతున్నాయని, కాబట్టి, జమిలి ఎన్నికలకు తమ పార్టీకి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గుతుంది, అవినీతి తగ్గుతుందని, ఓటుకు నోటు కేసు వంటివి రావని ఆయన పేర్కొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణ దేశానికి మేలు చేసేదే అని అంతిమంగా తమ పార్టీ జమిలీ ఎన్నికలకు అనుకూలమని లేఖలో పేరొన్నారు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల నిర్వహణ విషయంలో లా కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటోంది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీలు జమిలీకి మద్దతు ప్రకటించాయి. కానీ మెజార్టీ పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. అకాలీదళ్, టీఆర్ఎస్, వైసీపీ జమిలీ ఎన్నికలను గట్టిగా సమర్థిస్తున్నాయి. మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ ఇదో రాజకీయ ఎత్తుగడగా భావించి దానిని వ్యతిరేకిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసే దిశగానే జమిలీ వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాయి.