Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాపం భారతదేశంలో యడ్యూరప్ప అంత దురదృష్టవంతుడు ఎవరూ లేరేమో ? మూడుసార్లు సీఎం పీఠాన్ని అధిష్టించినప్పటికీ… ప్రతిసారి కూడా ఆయన అధికారం తుమ్మితే ఊడిపోయే ముక్కు చందాన తయారయ్యింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా అదృష్టం ఆయన్ని వెక్కిరించింది. తొలుత 2007 నవంబర్ 12న కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి బాధ్యతలను స్వీకరించారు. జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఆయన సీఎం అయ్యారు. అయితే మద్దతును కొనసాగించేందుకు జేడీఎస్ నిరాకరించడంతో కేవలం వారం రోజులకే ముఖ్యమంత్రి పదవిని ఆయన కోల్పోయారు.
తదుపరి ఎన్నికల తర్వాత 2008 మే 30న ముఖ్యమంత్రిగా ఆయన రెండోసారి బాధ్యతలను చేపట్టారు. అయితే, అక్రమ మైనింగ్ కేసులో గాలి పేరుతో బాటు యడ్యూరప్ప పేరును లోకాయుక్త చేర్చడంతో… ఆయనపై కేంద్ర నాయకత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో, విధిలేని పరిస్థితుల్లో 2011 జులై 31న రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. తాజాగా ఇప్పుడు మెజార్టీ లేకున్నా… సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పుకుంటా, లీగల్ గానీ గవర్నర్ అండతో యడ్యూరప్ప ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. బలనిరూపణకు యడ్డీకి 15 రోజుల సమయాన్ని గవర్నర్ ద్వారా పొంది ఎలా అయినా హార్స్ ట్రేడింగ్ చేసి ముఖ్యమంత్రిగా కొనసాగుదాన్ అనుకున్న ఆయనకి ఈ సారి సుప్రీం కోర్టు రూపంలో దరిద్రం వెంటాడింది. కాంగ్రెస్, జేడీఎస్ లు సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో… ఈ సాయంత్రం 4 గంటలకు బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది.
ఎన్ని ప్రయత్నాలు చేసినా, స్వయంగా తానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరాలు చేసినా ‘గాలి’ బ్యాచ్ అంతా రంగం లోకి దిగినా మ్యాజిక్ ఫిగర్ ను సాధించడం బీజేపీ వల్ల కాలేదు. దీంతో, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మూడోసారి ముచ్చటగా మూడు రోజుల్లోనే ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విధంగా దేశంలోనే అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిగా ఆయన రికార్డ్ సృష్టించాడు. అయితే ఆయన అతి తక్కువ కాలం పదవిలో ఉన్న సిఎంల జాబితాలో మాత్రం టాప్ స్థానం దక్కించుకోలేక పోయాడు. ఆ లిస్ట్ లో కూడా రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. మూడో సారి కేవలం మూడు రోజుల పాటు మాత్రమే ఆయన సీఎంగా ఉన్నారు. అయితే ఇది మొదటి రికార్డ్ కాదు. రెండో రికార్డ్. ఒకరోజు సీఎంగా యూపీకి చెందిన జగదాంబికా పాల్ రికార్డు సృష్టించారు.