Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులు అవి. కెసిఆర్ స్వయంగా కాంగ్రెస్ అగ్రనేతలుతో సమావేశం అయ్యారు. ఉద్యమ వ్యూహాన్ని రూపొందించడం, అమలు చేయడంలో వారి నుంచి పూర్తి సహాయసహకారాలు పొందారు. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెరాస అధినేత కెసిఆర్ కనుసన్నల్లో పనిచేశారు. కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఆంధ్ర నాయకులని కెసిఆర్ కన్నా ఎక్కువ తిట్టారు. ఇదే ఊపులో కాంగ్రెస్ గనుక తెలంగాణ ఇస్తే ఆ పార్టీలో తెరాస విలీనానికి అభ్యంతరమే లేదన్న రీతిలో వ్యవహరించారు కెసిఆర్. ఇక తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు అయితే సోనియా కి కుటుంబ సమేతంగా కృతజ్ఞతలు చెప్పి వచ్చారు. ఎప్పుడైతే తెలంగాణ ప్రక్రియ పూర్తి అయ్యిందో కాంగ్రెస్ కి ఝలక్ ఇచ్చిన కెసిఆర్ ఎన్నికలకు ఒంటరిగా వెళ్లడమే కాదు అధికార పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నారు.
ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలి చూసినవాళ్లకు కెసిఆర్ వ్యూహమే గుర్తుకు వస్తోంది. కేసుల నుంచి బయటపడాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరం. అది జరగాలంటే ముందుగా బీజేపీ. టీడీపీ మధ్య బంధం తెగిపోవాలి. అందుకు బీజేపీ ని రెడీ చేయడానికే అడిగి అడగ్గానే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు ప్రకటించారు. బీజేపీ తో పొత్తుకు సిద్ధమైన సంకేతాలు ఎన్నో రకాలుగా ఇచ్చారు. ఇక ఏపీ లో చంద్రబాబు అంటే పడని బీజేపీ నేతలని ఈ వ్యూహంలో పావులుగా వాడుకున్నారు. వీరి మాటలు నమ్ముకుని బీజేపీ హైకమాండ్ కూడా టీడీపీ ని వదిలించుకునే పని మొదలెట్టింది. తీరా కెసిఆర్ తరహాలోనే అన్ని అవసరాలు తీరాక ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి బీజేపీ ని జగన్ దూరం పెట్టే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. బీజేపీ పేరు ఎత్తితేనే ఆంధ్రులు మండిపోతున్న విషయం సీఎం కుర్చీ మీద గంపెడు ఆశలు పెట్టుకున్న జగన్ కి ఇంకొకరు చెప్పాలా ?. ఈ వ్యవహారం చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఏపీ లో బీజేపీ పరిస్థితి వున్నది పోయే, వుంచుకున్నదీ పోయే అన్నట్టు తయారు అవుతుందేమో !