Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్యారడైజ్ పేపర్లలో జగన్ పేరు ఉందని ప్రపంచమంతా గగ్గోలు పెడుతోంటే… ఆయన మాత్రం విచిత్ర వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో తనకు డబ్బు ఉందని నిరూపిస్తే… రాజకీయాలనుంచి తప్పుకుంటానని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా మూడోరోజు జగన్ వీరనాయునిపల్లె మండలం పరిధిలో పర్యటిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
చంద్రబాబుకు 15 రోజుల సమయం ఇస్తున్నానని, ప్యారడైజ్ పేపర్లలో తన పేరు ఉన్నట్టు నిరూపించాలని, అలా ఆయన చేయగలిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని జగన్ వ్యాఖ్యానించారు. విదేశాల్లో తనకు డబ్బులు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనకు నిజంగానే డబ్బులు ఉంటే నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోయేది కాదని ఆయన చెప్పుకొచ్చారు.
తాను ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమం మొదలుపెట్టగానే చంద్రబాబులో భయం మొదలవుతుందని, వెంటనే ఆరోపణలు, విమర్శలు చేస్తారని జగన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అలాగే ప్యారడైజ్ పేపర్లంటూ విమర్శలు మొదలుపెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఏవన్నా ఆరోపణలు చేయగానే ఆయన తోక పేపర్లు అవాకులూ, చవాకులు రాస్తాయని విమర్శించారు. నవరత్నాలతో రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో చిరునవ్వులు విరబూయాలనేదే తన ఆకాంక్ష అని జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు.