Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నిన్నమొన్నటిదాకా ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని కడిగి పారేయడానికి దాదాపు అన్ని పార్టీలు అఖిల పక్షం ఏర్పాటు చేయాలని టీడీపీ సర్కార్ మీద ఒత్తిడి తెచ్చాయి. ఇప్పుడు సందర్భం వచ్చింది. ఇదే అంశం మీద లోక్ సభలో ఏకంగా అవిశ్వాసం పెట్టే పరిస్థితి వచ్చింది. దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి అఖిల పక్షాని కూడా ఢిల్లీ తీసుకెళ్లాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ముందుగా వారితో అమరావతిలో నేడు భేటీ కావాలి అనుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ కి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ సహా ఆ పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ, జనసేన కూడా దూరం అని ప్రకటించేసాయి.
పైగా ఇప్పుడు అఖిల పక్ష సమావేశం వల్ల ప్రయోజనం లేదని తేల్చేశాయి వైసీపీ, జనసేన. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం ఇచ్చిన హామీలు, వాటిని తుంగలో తొక్కిన వైనం మీద హాట్ హాట్ గా చర్చ సాగుతున్న వేళ అఖిల పక్షం కూడా ఓ తీర్మానం చేసి దాని అమలుకు డిమాండ్ చేస్తే ఓ విలువ ఉంటుంది. ఆలా గాకుండా సింగల్ గా వెళితే ఈ నాలుగేళ్లలో మోడీ సర్కార్ ఏమీ చేయకపోగా ఎగతాళి చేసి పంపినట్టే ఉంటుంది. ఈ విషయం కూడా అర్ధం చేసుకోకుండా బీజేపీ దారిలోనే వైసీపీ, జనసేన కూడా అఖిల పక్షానికి దూరం గా వుండాలని నిర్ణయించడం చూస్తుంటే ఆపరేషన్ గరుడ నిజమే అనిపిస్తోంది. ఈ సమావేశం రాజకీయం కోసం పెట్టింది కాబట్టే దూరం గా ఉంటున్నామని పవన్ చెప్పిన మాటల్లో నిజం వుంది అనుకున్నప్పటికీ చంద్రబాబు విసిరిన ఉచ్చులో ఇప్పటికే వైసీపీ, జనసేన ఇరుక్కున్నాయి. అఖిల పక్షానికి బీజేపీ తో పాటుగా వైసీపీ, జనసేన గైరుహాజరుతో ఆ రెండు పార్టీలు ఎవరి తరపున అన్నది ప్రజలకు చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఒకవేళ అఖిల పక్షానికి వస్తే మిగిలిన పక్షాలను సంతృప్తి పరచడానికి అయినా ప్రధాని మోడీ, బీజేపీ ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది కాబట్టే ఆ పార్టీలు ఈ సమావేశానికి రావడం లేదని జనానికి కూడా అర్ధం అయ్యింది.