ఒక రొట్టి కోసం రెండు పిల్లులు కొట్టుకుంటే కోతి వచ్చి రొట్టి మొత్తం తినేసి వెళ్ళిపోయే కథ గుర్తుకు వస్తుంది ఆంధ్రా రాజకీయాల తీరు చూస్తుంటే. ఈ మధ్య జగన్ పవన్ మీద చేసిన వ్యాఖ్యలు ఆంధ్రా రాజకీయాలలో ఒక అలజడిని సృష్టించాయి. అయితే, అలా అనడం ఎంత వరకు సమంజసమో, అది ఎంతవరకు తనకి లాభం అనుకున్నాడో జగన్ కే తెలియాలి. ఇలా అనడం వెనుక తన ఆలోచనలు ఏమయినా కూడా తెదేపాకి ప్రతికూలంగా ఉండే వ్యక్తుల ఆలోచనలు మాత్రం జగన్ నుండి చూపులు పవన్ వైపు తిప్పాలని అనుకుంటున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే, జగన్ వ్యాఖ్యలపై పవన్ విమర్శించకుండా ఉండడం, వ్యక్తిగతంగా విమర్శించడంవద్దు అని తన సన్నిహితులుకి చెప్పడం లాంటివి పవన్ కు మేలు చేసేవిగా కనిపిస్తున్నాయ్. అయితే, ఇది పవన్ తెలివిగా వేసిన అడుగు అనుకోవాలో, లేక ఆయన వ్యక్తీత్వానికి నిదర్శనం అనుకోవాలో ఎవరికే వారే ఆలోచించుకోవాలి.
ఇదిలా ఉండగా, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం తరతరాలుగా వస్తున్న ఆచారం కాగా ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న రగడతో తెదేపాకి లాభం చేకూరేట్టుగా అనిపిస్తుంది. వీరి మధ్య నడుస్తున్నది ముఖ్యమంత్రి పదవి కోసమో లేక ప్రతిపక్ష నాయకుడి స్థానం కోసమో అన్నది కొంచెం అగమ్యగోచరంగానే ఉంది. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్, ఈ నాలుగేళ్ళలో చంద్రబాబు నాయుడుని ఏం చేసావ్ అని అడగడమే గానీ రాష్ట్రం కోసం ఈయన ఏం చేసాడన్నది ఒక ప్రశ్నగా మారింది. అసెంబ్లీ హాల్ నుండి బాయ్ కాట్ లు చేయడం, ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ సమావేశాలలో మాట్లాడాల్సిన సమయంలో వైకాపా యంపీలు రాజీనామా చేయడం, ఇవన్నీ జగన్ ని ప్రతిపక్ష నాయుకుడిగా ఏం చేశావ్ అనే ప్రశ్నలకి గురయ్యేలా బాధ్యుడిని చేస్తాయ్. కానీ, 2014 ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారునున్నాయి. వేసవి వేడి కన్నా వేసవిలో వచ్చే ఎన్నికల వేడే ఎక్కువగా ఉండేట్టు అనిపిస్తుంది.