Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాలుగేళ్ళు కలిసి ప్రభుత్వాలు నడిపిన తెదేపా-బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో తేడాలు వచ్చి విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తెలుగుదేశం బీజేపీ నుండి విడిపోక ముందు నుండే వైసీపీ బీజేపీకి అనుకూలం అనే సంకేతాలు ఇస్తూ ఉండేది. ఇప్పుడు కూడా తెలుగుదేశం విడిపోయిన నాటి నుండి కొన్ని కొన్ని సందర్భాలలో బయటపడుతూ వచ్చిన బీజేపీ – వైసీపీ రహస్య మైత్రి ఇప్పుడు మరో సారి బట్టబయాలు అయ్యింది. కర్ణాటకలో ఎన్నికలు దగ్గరికి వచ్చిన సంగతి తెలిసిందే. కన్నడ నాట కూడా అభ్యర్ధుల గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో తెలుగు వారు ఉన్నారు సుమారు 55 సీట్లలో తెలుగువారి నిర్ణయమే అభ్యర్ధిని గెలిపిస్తుంది. అయితే కర్ణాటక ఎన్నికల్లో భాజపాకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని, ఆంధ్రాకి అన్ని విధాలుగా అన్యాయం చేసిన భాజపాకి మద్దతు పలకొద్దంటూ అక్కడి తెలుగు ప్రజలకు టీడీపీ పిలుపునిచ్చింది.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కర్ణాటక వెళ్లి, జేడీఎస్ కు మద్దతు ప్రకటించారు. కానీ, కర్ణాటక ఎన్నికల్లో వైకాపా మాత్రం తన వైకరిని బయటపెట్టలేదు. ఎలాగూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటం చేస్తున్నారు, (చేస్తున్నామని చెబుతున్నారు), ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమిస్తున్నారు(ఉద్యమిస్తున్నామని చెబుతున్నారు). అలాంటప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటెయ్యద్దు అని ఒక్క మాట చెప్పచ్చు కానీ జగన్ దగ్గర నుండి గల్లీ స్థాయి నేత వరకు ఆ అంశం మీద అసలు నోరే మెదపట్లేదు. అది కాక భాజపాకి అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతలు కొంతమంది వైకాపా నేతలే నెత్తినేసుకుని, వార్డుల్లో తిరుగుతూ ఉండటం ఇప్పుడు బీజేపీ-వైసీపీ రహస్య బంధాన్ని బట్టబయలు చేసింది.
మొళకాల్మూరులో గాలి ప్రధాన అనుచరుడు బి.శ్రీరాములు, బళ్లారి సిటీలో గాలి సోదరుడు సోమశేఖరరెడ్డి బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అయితే రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, జగన్ కి సన్నిహితుడు కాపు రామచంద్రారెడ్డి మొళకాల్మూరులో కొన్ని వార్డులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారట. ఇంకేముంది రాయదుర్గం నుంచి వైసీపీ కార్యకర్తలను, మునిసిపల్ కౌన్సిలర్లను, తీసుకొచ్చి మరీ బీజేపీ అభ్యర్దులకి అనుకూలంగా ప్రచారం చేయిస్తున్నారు. అయితే జగన్ తో పాటు గాలి జనార్ధన్ రెడ్డి కి కూడా ఆయన సన్నిహితుడు కావడం వలన ఈ ప్రచారం చేస్తున్నారు అనుకున్నా ఆయన ఒక్కరే తిరిగితే ఒకెత్తు… కాని రాయదుర్గం నుంచి తన అనుచరుల్ని తీసుకొచ్చి మరీ భాజపా ఓటెయ్యాలంటూ ప్రచారం చేయించడం గమనించదగ్గ విషయం.
అంతేకాదు, కర్నూలు జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే కూడా అక్కడ భాజపాకి మద్దతుగా ప్రచారానికి సహాయ సహకారాలు అందిస్తున్నారట. వైకాపా అధినేత జగన్ కి, గాలి జనార్థన్ రెడ్డికి ఉన్న సాన్నిహిత్యం గురించి రాజకీయ అవగాహన లేని వారికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటూ కన్నడ ఎన్నికల్లో గెలిస్తే గాలి దర్జాగా బీజేపీ నేత హోదాలో తిరగడం గ్యారెంటీ ఇక ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వారి పొత్తు ఖాయం అయినట్టే ! ప్రస్తుతం రహస్య స్నేహితుల్లా ఉన్న బీజేపీ-వైసేపీ త్వరలోనే ముసుగులు తీసేసి పోత్తుల అంశం చూస్తాయని విశ్లేషకులు అంటున్నారు.