Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 లో అధికారమే పరమావధిగా వైసీపీ అప్పుడే ఎన్నికల కళ సంతరించుకుంటోంది. పార్టీ ప్లీనరీ లో ఆ వాతావరణం స్పష్టంగా కనిపించింది. ఎన్నడూ లేనిది వైసీపీ లో జగన్ తో సమానంగా ప్రశాంత్ కిషోర్ కి గౌరవం లభించింది. ఎన్నికల వ్యూహకర్తగా వున్నవారిని పార్టీ వేదిక ఎక్కించడం ఇంతకుముందెన్నడూ జరగలేదు. జగన్ ఆ కొత్త సంప్రదాయానికి తెర లేపాడు. అయితే ప్రశాంత్ కిషోర్ రాక విషయం తెలిసినప్పుడు వైసీపీ నేతలు చాలా మంది సంబరపడ్డారు. తాము జగన్ కి చెప్పలేని విషయాలు ప్రశాంత్ చెప్పి ఒప్పించగలడని వారంతా నమ్మారు. పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన సేవలు బాగా ఉపయోగపడతాయని భావించారు. అలా ప్రశాంత్ లో ఓ ఆపద్బాంధవుడిని చూసిన వైసీపీ నేతలు తాజాగా ఆయనని చూసి టెర్రర్ అవుతున్నారు. ఆ కారణం భలే చిత్రంగా వుంది.అదేంటో చూద్దామా!
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఓ 25 మంది పనితీరు బాగా లేదని, ఇక నియోజక వర్గ ఇన్ ఛార్జ్ ల్లో 35 మంది సమర్ధంగా పని చేయడం లేదని ప్రశాంత్ కిషోర్ నివేదికలో తేలిందట. అంటే మొత్తం 175 స్థానాలకు గాను 60 మందికి టికెట్ మీద డౌట్ రేకెత్తించారు ప్రశాంత్ కిషోర్. అయితే మిగిలిన 110 మంది తాము సేఫ్ అనుకున్నారు. ఇక ఆ చాప్టర్ క్లోజ్ అనుకున్నవాళ్ళకి ప్రశాంత్ ఇంకో షాక్ ఇచ్చాడంట. ఇప్పుడు ప్రకటించింది త్రైమాసిక ఫలితాలంట. మున్ముందు కూడా మూడు నెలలకి ఓ సారి సర్వే లు జరుగుతూనే వుంటాయని, అన్ని సర్వేలు చూసాక టికెట్ మీద నిర్ణయం ఉంటుందని ప్రశాంత్ టీం ఉప్పందించిందట. ఈ వ్యవహారాలు చూసేందుకు నియోజకవర్గానికి ఓ ఐఐటీ స్టూడెంట్ ఉంటాడని, వారికి అన్ని విధాలుగా సహకరించాలని ఇప్పటికే హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లాయట. మా మీద నిఘా కోసం వచ్చే వారికి మేము సహకరించడం ఏంటని నేతలు రగిలిపోతున్నారంట. ఇంతకుముందు దాకా ప్రజల్లో ఆదరణ, అధినేత జగన్ కరుణ ఉంటే చాలు వైసీపీ టికెట్ ఖాయమని ఆ పార్టీ నేతలు చాలా మంది భావించారు. అదే నమ్మకంతో కూడా వున్నారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ టీం ని మెప్పించే పరీక్ష కొత్తగా రావడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. తమ రాజకీయ జీవితాన్ని నిత్యపరీక్షకి గురి చేస్తున్న ప్రశాంత్ అంటే టెర్రర్ మొదలైంది. ఇప్పుడు ప్రశాంత్ ని పార్టీ నేతలు చూస్తున్న తీరుని పరిశీలిస్తే ప్రశాంత్ వల్ల వైసీపీ లో సరికొత్త సంక్షోభం పుట్టినా ఆశ్చర్యపోనవసరంలేదు.
మరిన్ని వార్తలు