Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ తర్వాత టీడీపీ ఎంపీలు విభజన హామీల కోసం తీవ్ర ఆందోళన చేస్తోంటే… ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం నామమాత్రంగా స్పందిస్తోందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసే లోపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే ఏప్రిల్ ఆరున తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు ప్రత్యేక హోదా ఒక్కటే సంజీవని అన్నారని, ఆ తర్వాత మాట మార్చి హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మేలు అంటూ మాటమార్చారని మండిపడ్డారు. తనకు వచ్చే ప్యాకేజీల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా అమ్మేశారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఒక్కటే మొదటినుంచి పోరాడుతోందని తెలిపారు. ఏపీకి హోదా ఒక్కటే సంజీవని అని, తాను ఇక్కడినుంచి పిలుపునిస్తున్నానని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యాచరణ ప్రకటించారు. మార్చి 1న వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ఎదుట ధర్నాలు చేస్తారని, మార్చి 3న తాను పాదయాత్ర చేస్తున్న స్థలం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలను ఢిల్లీకి పంపిస్తానని జగన్ తెలిపారు. మార్చి5న బడ్జెట్ మలివిడత సమావేశాలు ప్రారంభమయ్యే రోజు…వైసీపీ నేతలంతా ప్యాకేజీ మాకొద్దు-హోదా మా హక్కు అనే డిమాండ్ తో ఢిల్లీలో ధర్నా చేస్తారని తెలిపారు. బడ్జెట్ సమావేశాలు జరిగే నెలరోజులపాటు ఎంపీలంతా పార్లమెంట్ హాల్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడతారని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే ఏప్రిల్ ఆరు లోపు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే చివరిరోజు వైసీసీ ఎంపీలు రాజీనామా చేసి పార్లమెంట్ నుంచి బయటకువస్తారని జగన్ వెల్లడించారు.