తెలంగాణ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో హైదరాబాద్ పేరు మార్పుపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు బహిరంగ సభలో ప్రస్తావించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చడంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
గతంలో బండి సంజయ్ సైతం అనేకసార్లు ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. ఇప్పుడు బీజేపీ అగ్రనేతల నోటివెంట ఆ మాటలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘అహ్మదాబాద్ పేరును ముందుగా అదానీబాద్‌గా ఎందుకు మార్చకూడదు? ఇంతకీ ఆయన ఎవరు హైదరాబాద్ పేరు మార్చడానికి’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది