నిన్న సోమవారమే తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ 119 నియోజకవర్గాలకు ఒకే విడత లో అనగా డిసెంబర్ 7 న ఎన్నికల పోలింగ్ నిర్వహించబడుతుంది. ఈ ఎన్నికలకి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్న సోమవారంతో ప్రారంభం కాగా, ఈ నెల 19 తో ముగియనుంది. తదుపరి నవంబర్ 20 న నామినేషన్ల పరిశీలన మరియు నవంబర్ 22 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల కమిషన్ తమ ఎన్నికల నోటిఫికేషన్ లో పేర్కొంది. తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యి, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని నోటిఫికేషన్ లో వివరించినా, తెలంగాణ రాష్ట్రము లోని మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని 13 నియోజకవర్గాల్లో మాత్రం ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ ప్రాంతాలలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్, ఎటువంటి అవాంతరాలు జరగకుండా భద్రత పైన దృష్టి సారించి, భారీగా పోలీసులను మరియు భద్రత దళాలను మోహరించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఈ 13 నియోజకవర్గాలైన జయశంకర్ భూపాలపల్లి, మంథని, ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూరు, చెన్నూరు, ఇల్లందు, ములుగు, పినపాక, అశ్వారావు పేట, కొత్తగూడెం, భద్రాచలం లలో తొమ్మిది గంటలు అనగా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటలు మాత్రమే పోలింగ్ నిర్వహిస్తుండగా, మిగతా 106 నియోజకవర్గాల్లో మాత్రం ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లుగానే పది గంటల పాటు పోలింగ్ నిర్వహణ జరుగుతుంది.ఇదికాకుండా ఎన్నికల కమిషన్ అభ్యర్థుల మీద కొన్ని నిబంధనలను విధించింది. ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులు చేసే ఖర్చు 28 లక్షలకు మించరాదని మరియు వారి అనుచరుల వద్ద కూడా 50 వేలకు మించి డబ్బు కలిగిఉండరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారికి నోటీసులు జారీ చేసి, కేసులు కూడా నమోదు చేస్తామనే హెచ్చరికలు కూడా ఎన్నికల కమిషన్ జారీ చేసింది.