Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉప ఎన్నిక తర్వాతా నంద్యాలలో రాజకీయ వేడి చల్లారలేదు. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. సూరజ్ గ్రాండ్ సమీపంలోని రెండు పార్టీల నేతల మద్య జరిగిన ఘర్షణ రణరంగాన్ని తలపించింది. వైసీపీ కార్యకర్త భాషా కుటుంబాన్ని పరామర్శించి తన అనుచరులతో కలిసి శిల్పా చక్రపాణి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో గన్ మెన్ తో కలిసి వస్తున్న టీడీపీ నేత అభిరుచి మధు అటుగా వస్తుండటంతో ఇద్దరి వాహనాలు ఎదురుపడ్డాయి. వెనక్కి తీసేందుకు ఇరు వర్గాలూ అంగీకరించకపోవటంతో గొడవ మొదలై ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా వెళ్లింది.
మధు కారుపై శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరులు దాడి చేయటంతో మధు గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై మంత్రి అఖిల ప్రియ స్పందించారు. ఓ పథకం ప్రకారమే మధు కారుపై దాడిచేశారని, ప్రాణరక్షణ కోసమే గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడని చెప్పారు. ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అటు ఈ ఘటనపై మధు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి, ఆయన అనుచరులు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు శిల్పాచక్రపాణి రెడ్డి సహా ఎనిమిది మందిపై కేసు నమోదుచేశారు.
మరిన్ని వార్తలు: