Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటకంలో బీజేపీ రాజకీయంపై విమర్శలు కొనసాగుతున్నాయి. పలు పార్టీల నేతలు బీజేపీ తీరును తప్పుబడుతున్నారు. కర్నాటకలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలపై టీడీపీ మరోమారు ఆగ్రహం వ్యక్తంచేసింది. కర్నాటకలో ఎలాగైనా అధికారాన్ని చేపట్టి…దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం చెలాయించాలని బీజేపీ యత్నించిందని ఏపీ ఆర్థికమంత్రి యనమల ఆరోపించారు. అప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుందని, అయితే కర్నాటక ప్రజలు ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని యనమల వ్యాఖ్యానించారు. కర్నాటకలో బీజేపీ అనుసరించిన తీరు చాలా బాధాకరమని, భవిష్యత్ లో ఇలాంటి పరిణామాలు ఇంకా ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని, ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు గాలిజనార్ధన్ రెడ్డి చేసిన బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులపై విచారణ జరిపించాలని యనమల డిమాండ్ చేశారు. ఏపీలో జగన్, కర్నాటకలో గాలి, బీజేపీకి ప్రధానవ్యక్తులుగా మారారని మండిపడ్డారు. దక్షిణాదిన బీజేపీ అడుగుపెట్టకుండా అడ్డుకోవాలన్నారు. అటు కర్నాటలో బీజేపీ తీరుపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ రూ, 6,500 కోట్లు ఖర్చుపెట్టిందని ఏఐసీసీ నేత ఆనంద్ శర్మ ఆరోపించారు. బీజేపీ ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి కనీసం రూ. 20 కోట్లు పంచిపెట్టిందని, ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మరో రూ. 4వేల కోట్లు కేటాయించిందని, ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రపంచలోనే అత్యంత సంపన్నమైన పార్టీ బీజేపీ అని, ఆ పార్టీకున్నంత పెద్ద కార్యాలయం ఏపార్టీకీ లేదని, దేశంలోని అన్ని పార్టీల ఆదాయం కంటే రెట్టింపు బీజేపీకి ఉందని, అది ఎలా వచ్చిందో ప్రజలకు చెప్పాలని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అపవిత్ర కలయికగా అభివర్ణించడం సరైనది కాదని, బీహార్ ప్రజలు ఆర్ జేడీ, జేడీయూ,కాంగ్రెస్ కు ఓటేస్తే, జేడీయూతో కలిసి బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం పవిత్రమైన కలయికా…అనిప్రశ్నించారు. అతిపెద్ద పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇవ్వాలని మాట్లాడుతున్న అమిత్ షా గోవా, మణిపూర్, మేఘాలయలో ఇదే సూత్రం ఎందుకు వర్తింపచేయలేదని ఆనంద్ శర్మ ప్రశ్నించారు.