Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని సంవత్సరాల ముందు వరకు సినిమా నిర్మాతలకు ఒకే అదాయ మార్గం. అదే థియేట్రికల్ రైట్స్. ప్రేక్షకులు థియేటర్‌లో సినిమా చూడటం వల్ల వచ్చే కలెక్షన్స్ మాత్రమే నిర్మాతకు ఆదాయం. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. నిర్మాతకు ఒక సినిమా ద్వారా పది మార్గాల్లో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక స్టార్ హీరోల సినిమాకు ప్రతీది ఆదాయ మార్గమే. ఒక సినిమాలో తమ బ్రాండ్‌ను చూపించినందుకు కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. ఇక సినిమాల పబ్లిసిటీ సందర్బంగా పలు సంస్థలు మీడియా పార్టనర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వస్తాయి. దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది.
ఇక ఆడియో విడుదల రైట్స్ వేడుక శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, థియేట్రికల్ రైట్స్, యూట్యూబ్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ డిజిటల్ రైట్స్ ఇలా పలు రకాల ద్వారా నిర్మాత ప్రస్తుతం ఆదాయాన్ని దక్కించుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కొత్తగా మరో రైట్స్ కూడా మొదలయ్యాయి. అదే మేకింగ్ వీడియో రైట్స్. గతంలో మేకింగ్ వీడియోను మామూలుగా యూట్యూబ్‌లో విడుదల చేసేవారు. కాని ఇప్పుడు పెద్ద సినిమాల మేకింగ్ వీడియోలను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కొనుగోలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ మేకింగ్ వీడియో మరియు డిజిటల్ రైట్స్‌ను దాదాపు 7.5 కోట్లు పెట్టి అమెజాన్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అన్ని భాషల్లో కూడా అమెజాన్ ఈ చిత్రాన్ని ప్రసారం చేసుకోవచ్చు. అలాగే మేకింగ్ వీడియోను కూడా తమ వెబ్ సైట్‌లో పోస్ట్ చేస్తుంది. మరే చోట కూడా మేకింగ్ వీడియోలు కనిపించవు. మేకింగ్ వీడియోల బిజినెస్ హాలీవుడ్‌లో ఇప్పటికే ఉండగా ఇండియాలో మొదటి సారి సైరాకు జరుగుతుందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.