నిన్న రాత్రి నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయట. బాబ్లీ కేసు నుంచి కేసీఆర్ తిట్ల దండకం వరకు పలు విషయాలను కేబినెట్ మీట్‌లో ప్రస్తావించారు. అలాగే కేంద్రంపై అన్ని స్థాయుల్లోనూ పోరాటం చేయాలని నిర్ణయించారు. అలాగే, ఒకే సామాజిక వర్గంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నట్టు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
బాబ్లీ కేసుపై మంత్రులతో చర్చించిన చంద్రబాబు ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలా? వద్దా? అనే విషయంపై మీద కూడా చర్చించారు. ఈ విషయమై నేడు మరోమారు అడ్వకేట్ జనరల్, సీనియర్ మంత్రులతో సమావేశమై చర్చించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భారీ ర్యాలీతో కోర్టుకు హాజరైతే బాగుంటుందని సూచించారు. మరో మంత్రి యనమల మాట్లాడుతూ వారెంట్ రీకాల్ చేయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. దీంతో నేడు మరోమారు సమావేశమై ఈ విషయాన్ని చర్చిద్దామని చంద్రబాబు అన్నారు.
చక్కెర పరిశ్రమల పనితీరును ప్రతి నెల సమీక్షించాలని మంత్రులు, అధికారులను సీఎం ఆదేశించారు. వాటి పనితీరు బాగుంటేనే ప్రభుత్వ సాయం అందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. సీఆర్డీయేకు రూ.10 వేల కోట్లు, ఆర్టీసీకి రూ.500 కోట్లు రుణ సమీకరణకు ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల పునరావాసానికి రూ.146 కోట్లు ఇవ్వాలని, సాగునీటి ప్రాజెక్టులపై పీపీపీ పద్ధతిలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మోసాలకు పాల్పడే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని అధికారులను బాబు ఆదేశించారు. 371 ఎంపీఈవో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.