Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన బాధిత ఏపీకి అండగా నిలవడానికి బదులు….ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రానికి నివేదికలు పంపుతూ..కేంద్రం, రాష్ట్రం మధ్య విభేదాలు సృష్టించిన గవర్నర్ నరసింహన్ పై ఏపీలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తన పరిధి మేరకు పనిచేసుకోకుండా…రాజకీయాల్లో జోక్యంచేసుకుంటూ గవర్నర్ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న తీరు…ప్రభుత్వానికి తెలిసినప్పటికీ..ఆ పదవిపై ఉన్న గౌరవం కారణంగా ఏనాడు ఏపీ ప్రభుత్వం నోరుమెదపలేదు. కానీ గవర్నర్ తీరు మరీ శృతిమించడంతో….ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొలిసారి…ఆయన వ్యవహారశైలిపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీకి వ్యతిరేకంగా గవర్నర్ ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హితవుపలికారు. ఇప్పుడు ఏపీ మంత్రులు కూడా నరసింహన్ తీరుపై మండిపడుతున్నారు. ఇన్నాళ్లు గవర్నర్ కేంద్రం దూత గా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలిసినా…చంద్రబాబు మౌనంగా ఉండడంతో…నోరెత్తకుండా ఉన్న మంత్రులు…ఇప్పుడు ముఖ్యమంత్రే విమర్శలకు దిగడంతో వారూ గవర్నర్ లీలలను బయటపెడుతున్నారు.
ఏపీ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉందని, విభజన హామీలు అమలయ్యేలా చూడాల్సిన గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యేలా ప్రవర్తిస్తున్నారని మంత్రి కాల్వశ్రీనివాసులు ఆరోపించారు. కేంద్రంచేస్తున్న అన్యాయంపై ఓ పక్క రాష్ట్రప్రభుత్వం పోరాడుతోంటే…దానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వానికి దూతలా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నరసింహన్ తీరుతో ప్రజాస్వామ్యానికి మచ్చ వచ్చే పరిస్థితులు దాపురించాయని దుయ్యబట్టారు. ఏపీపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేంద్రంగా కుట్ర జరుగుతోందని, అందులో గవర్నర్ నరసింహన్ పాత్రధారని మరో మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. అన్ని కుట్రల్లోనూ గవర్నర్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని, ఆయన అసలు వైఖరి ఇప్పుడు బయటపడిందని, అందుకే తాము ఆయన్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులేకాదు..గవర్నర్ తీరుపై సాధారణ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్నప్పటికీ ఏనాడూ ఏపీని పట్టించుకోని నరసింహన్….విభజనతో కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మరిన్ని ఇబ్బందులు కలిగించడంపై ప్రజల్లో వ్యతిరేకత కలుగుతోంది.