Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుస గెలుపులు నేపథ్యంలో టీడీపీ లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. దశాదిశాలేని నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా మూడేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించిన విషయం ఈ ఫలితాలతో రుజువయిందని టీడీపీ నేతలు అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చంద్రబాబు ప్రజలకుఎంతో దగ్గరయ్యారని, రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా నంద్యాల, కాకినాడ ఫలితాలే పునరావృతం అవుతాయని టీడీపీ నేతలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.
రాజకీయ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. మూడేళ్ల క్రితం చంద్రబాబుపై ప్రజలు ఎంత నమ్మకంతో అధికారాన్ని అప్పగించారో…అదే పరిస్థితి ఇప్పటికీ ఉందని వారు అంటున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని వారు అంటున్నారు. అనుకున్న లక్ష్యాలను చేరుకుని నవ్యాంధ్రను అగ్రరాష్ట్రంగా నిలపాలన్న చంద్రబాబు తాపత్రయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, మరికొన్నేళ్లు ప్రజలంతా చంద్రబాబు పక్షాన నిలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొని ప్రభుత్వకార్యక్రమాలను ప్రజలకు వివరించటం టీడీపీకి లాభించిందని చెప్పొచ్చు. రాష్ట్రం కోసం తాను ఎంతో కష్టపడుతున్నానని, ఉప ఎన్నిక, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయంసాధిస్తే…ఆ గెలుపు తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెప్పారు.
చివరకు ఆయన కోరుకున్నట్టుగానే నంద్యాల, కాకినాడ ఓటర్లు టీడీపీకి పట్టం కట్టి చంద్రబాబులో ఎనలేని ఉత్సాహాన్ని నింపారు. ఈ విజయాలపై చంద్రబాబు చాలా సంతోషంగా ఉన్నారు. తమ పార్టీని గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హేతుబద్దత లేని విభజనతో సంక్షోభంలో పడిన రాష్ట్రాన్ని తాను అభివృద్ధి చేస్తాననే నమ్మకం ప్రజల్లో ఉందని, అందుకే టీడీపీకి అపూర్వ విజయాలు అందించారని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. మరోవైపు నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.చంద్రబాబు మూడేళ్ల పాలనపై నంద్యాల ఉప ఎన్నిక రెఫరెండం అంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన వైసీపీ అధినేత జగన్ ఫలితాల తర్వాత మాత్రం మాటమార్చారు. నంద్యాల ఉప ఎన్నికకు ముందు వైసీపీ లో కనిపించిన అతివిశ్వాసం ఇప్పుడు మచ్చుకైనా కానరావట్లేదు. అధికారమే లక్ష్యంగా నవరత్నాలు ప్రకటించిన జగన్ కొన్నిరోజులకే నంద్యాల ప్రచార బరిలో దిగారు.
ఆ ప్రచారంలోనే వైసీపీ అధినేత అసలు స్వరూపం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసొచ్చింది. ముఖ్యమంత్రిని కాల్చి చంపండి, ఉరితీయండి అంటూ బహిరంగ సభలో వ్యాఖ్యానాలు చేయటం ద్వారా జగన్ ఉప ఎన్నికలో వైసీపీ ఓటమిని దగ్గరుండి ఖరారు చేశారు. ఆయన ప్రకటించిన నవరత్నాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అవినీతి పేరుతో అధికారపక్షంపై చేస్తున్న దుష్ప్రచారంలో నిజానిజాలేమిటో ప్రజలే తెలుసుకుంటున్నారు. వైసీపీకి ఇక రాష్ట్రంలో భవిష్యత్ లేదనే వాదనా వినిపిస్తోంది. జగన్ ప్రవర్తన, అసెంబ్లీలో బాధ్యతారహితంగా మాట్లాడటం, ప్రతిపక్షనేతగా నిర్మాణాత్మక పాత్ర పోషించటంలో విఫలమవటంతో ప్రజలు ఆయన పట్ల విసిగిపోయారని టీడీపీ నేతలంటున్నారు. ఈ పలితాల తర్వాతనయినా జగన్ ఆత్మశోధన చేసుకుని తన వైఖరి మార్చుకోవాలని పలువురు కోరుతున్నారు. మరి జగన్ వారి మాటలు వింటారా.. ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకే నడుచుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని వార్తలు: