Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఏపీ ప్రజలను తీవ్ర నిరాశానిస్పృహల్లోకి నెట్టేసింది. విభజన బాధిత ఏపీకి ఈ బడ్జెట్ లో న్యాయం జరుగుతుందని ప్రజలు పెట్టుకున్న ఆశలపై మోడీ సర్కార్ నీళ్లు చల్లింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపుల ఊసేలేదు. విభజన హామీలు వేటినీ అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటును భర్తీచేసేందుకు సాయం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రైల్వే జోన్ ప్రకటన వంటి అనేక హామీలపై బడ్జెట్ లో సాయమందుతుందుని ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలకు అరుణ్ జైట్లీ షాకిచ్చారు.
జాతీయ హోదా దక్కించుకున్న పోలవరం ప్రాజెక్టు కు సైతం బడ్జెట్ లో చోటు దక్కకపోవడంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విశాఖకు రైల్వేజోన్ ఇస్తామని గతంలో హామీఇచ్చిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మాత్రం మొండి చేయి చూపింది. బెంగళూరు మెట్రోకు రూ. 17వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు రూ. 17వేల కోట్లు కేటాయించిన అరుణ్ జైట్లీ విశాఖ రైల్వేజోన్ గురించి మాత్రం మాట్లాడలేదు. తెలంగాణకూ బడ్జెట్ లో నిరాశే ఎదురయింది. ప్రాణహిత-చేవెళ్ల కు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఎయిమ్స్ వంటి హామీలేవీ నెరవేరలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధుల కేటాయింపుపైనా తెలంగాణకు కేంద్రం మొండిచేయిచూపింది.