Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశరాజకీయాల్లో 2019 ఎన్నికలకు ముందే పెను మార్పులు వచ్చేట్టు వున్నాయి. రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారేట్టు కనిపిస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో బీజేపీ తో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీల్లో ఒకటిరెండు మినహా మిగతావి మొత్తం వేరే దారి చూసుకునే పనిలో వున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే బీజేపీ వారిని స్వయంగా దూరం చేసుకుంటోంది. ఇందుకు శివసేన ఓ పెద్ద ఉదాహరణ. సైద్ధాంతికంగా రెండు పార్టీల మధ్య పెద్దగా విభేదాలు లేకపోయినా రాజకీయంగా ఆ రెండు పార్టీలకు అసలు పొసగడం లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శివసేనని అవమానించడమే పనిగా పెట్టుకుంది బీజేపీ. ఎన్నికల్లో ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ncp ని దగ్గరకు తీసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలతో శివసేన కూడా రివర్స్ అయ్యింది. మహారాష్ట్రలో జరుగుతున్న ఈ పరిణామమే ఆంధ్రప్రదేశ్ లో కూడా రిపీట్ అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి.
పార్లమెంట్ వేదికగా జరిగిన రెండు పరిణామాలు నిశితంగా పరిశీలిస్తే ఇక టీడీపీ, బీజేపీ మధ్య పొత్తులు పోయి కత్తులు నూరుకోవడం ఖాయం అనిపిస్తోంది. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీ , కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హోదా, ప్యాకేజ్ అంశాన్ని ప్రస్తావించడం, అటు ఇంకో ఎంపీ రామ్మోహన్ నాయుడు విశాఖ రైల్వే జోన్ కోసం ప్రైవేట్ బిల్లు పెట్టడం చిన్న విషయం ఏమీ కాదు. 2019 లో అధికారంలోకి వచ్చాక కేంద్రాన్ని పార్లమెంట్ వేదికగా టీడీపీ ఈ స్థాయిలో గొంతు ఎత్తడం ఇదే మొదటిసారి. ఇక అదే సమయంలో ప్రధాని మోడీ తో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ 15 నిమిషాల పాటు ముఖాముఖీ మాట్లాడ్డం చిన్న విషయం అంతకన్నా కాదు. కొన్నాళ్లుగా ప్రధాని మోడీని కలవడానికి సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. పోలవరం లాంటి పెద్ద పెద్ద సమస్యలు వున్నా కేంద్రమంత్రుల స్థాయిలోనే చంద్రబాబు మాట్లాడాల్సి వస్తోంది. ఈ రెండు ఘటనలు ఇక విడిపోవడం మంచిదన్న రెండు పార్టీల ఆలోచనా ధోరణికి సంకేతాలు మాత్రమే.