Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాడుః నేను బ్రాహ్మణున్ని కాదు… మనిషిని
నేడుః వచ్చే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాలని ఉంది
పార్టీలోకో, పదవిలోకో వచ్చాక అలా మారుతున్నారో లేక, వైఖరిలో మార్పువచ్చాకే పార్టీలో చేరుతున్నారో తెలియదు కానీ… ఇటీవలి కాలంలో బీజేపీ నేతలుగా మారిన వారు, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్న వారు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు అచ్చంగా ఆరెస్సెస్ నేతలను తలపిస్తోంది. మొన్నటికి మొన్న మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో స్థానం దక్కించుకున్న కొత్త మంత్రి సత్యపాల్ సింగ్ భారతీయ పురాణాల్లో వచ్చే పుష్పకవిమానం గురించి ఐఐటీ విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మాజీ ఐపీఎస్ అధికారి అయిన సత్యపాల్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమయింది…
ఇక ఇప్పుడు కేరళ సూపర్ స్టార్ సురేశ్ గోపీ వంతు వచ్చింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ అయిన సురేశ్ గోపీ… తన సినిమాల్లో ఇచ్చిన సందేశాలకు పూర్తి విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. జంద్యం ధరించే వాళ్లందరినీ దేవుళ్లుగా పరిగణించాలంటూ అత్యంత వివాదస్పదమైన వ్యాఖ్య చేశారు. తిరువనంతపురంలో బ్రాహ్మణులు నిర్వహించిన యోగక్షేమసభకు హాజరైన సురేశ్ గోపీ ఈ వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. తనకు పునర్జన్మపై నమ్మకం ఉందని, వచ్చే జన్మలో తాను జంద్యం ధరించే కులంలో అంటే… బ్రాహ్మణుడిగా పుట్టి శబరిమల ఆలయ ప్రధాన పూజారిని అవుతానని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణకులంలో పుడితే దేవుడిని స్పృశించవచ్చని, స్నానం చేయించవచ్చని చెప్పడం ద్వారా… బీజేపీలో చేరిన తరువాత తాను ఎంత గొప్ప భక్తుడిగా మారానో పరోక్షంగా వెల్లడించాడు సురేశ్ గోపీ.
నిజానికి ఈ వ్యాఖ్యలు ఆరెస్సెస్, వీహెచ్ పీ నేతలో, లేకపోతే… తొలినుంచీ బీజేపీలో ఉన్న రాజకీయ నాయకుడో చెబితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. అలాగే దేవుణ్ని బాగానమ్మే సినిమా హీరోలు ఇలా చెప్పినా పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ సురేశ్ గోపీ ఈ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఎందుకంటే… ప్రైత్రుకమ్ అనే సినిమాలో సురేశ్ గోపీ హేతుబద్ధ ఆలోచనలు ఉన్న హీరో పాత్ర పోషించాడు. ఆ సినిమాలో ఆయన ఓ చోట… నేను బ్రాహ్మణుడిని కాదు… మనిషిని అంతే… నా మొలతాడును ఎప్పుడో తొలగించా… అలాగే ఇప్పుడు జంద్యాన్నీ తెంపేస్తున్నా అంటూ… ఆవేశంగా డైలాగ్ చెబుతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లుఈ డైలాగును ఉదహరిస్తూనే సురేష్ గోపీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాషాయ దళం మనసెరిగి నడుచుకునే ప్రవర్తనలో భాగంగానే సురేశ్ గోపీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.