Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బోఫోర్స్…ఈ పేరు చెబితేనే కాంగ్రెస్ ఉలిక్కిపడుతుంది. కేసు 1980ల నాటిదైనా ఇప్పటికీ బోఫోర్స్ కుంభకోణం వార్తల్లో అంశమే. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో మరుగున పడిన ఈ కేసును తాజాగా మరోసారి విచారించాలని సీబీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే కేంద్రంలో రాజకీయ ప్రకంపనలు తప్పవు. బోఫోర్స్ కేసును మళ్లీ విచారించాలని పార్లమెంటరీ కమిటీకి చెందిన పలువురు సభ్యులు కోరటంతో సీబీఐ స్పందించింది. కమిటీ కోరినట్టుగా పునర్విచారణకు సిద్దమని సంకేతాలు పంపించింది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న స్పెషల్ లీవ్ పిటీషన్ కు కూడా మద్దతు ఇస్తామని తెలిపింది. 1980ల్లో రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్న సమయంలో బోఫోర్స్ కుంభకోణం వెలుగుచూసింది.
భారత సైన్యానికి 400 అత్యాధునిక గన్ లు అందించేందుకు భారత ప్రభుత్వం, స్వీడిష్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ ల మధ్య ఒప్పందం కుదిరింది. 1986 మార్చి 24న కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ. 1437 కోట్లు. ఈ ఒప్పందం కోసం భారత్ లోని ప్రముఖ రాజకీయ నాయకులకు, రక్షణ అధికారులకు బోఫోర్స సంస్థ భారీగా ముడుపులు చెల్లించిందని 1987లో స్వీడిష్ రేడియో ప్రకటించటం సంచలనాలకు దారితీసింది. ఇటలీ వ్యాపారి ఒట్టావియో ఖత్రోచి ఈ వ్యవహారంలో ప్రముఖ పాత్ర పోషించారని, ఇందులో రాజీవ్ కుటుంబ సభ్యుల హస్తముందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అనంతర కాలంలో దేశరాజకీయాల్లో బోఫోర్స్ కుంభకోణం రాజకీయ పక్షాలకు ప్రధాన అస్త్రం అయింది.రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా బోఫోర్స్ అంశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టింది. విచారణ సాగుతుండగానే నిందితులు విన్ చద్దా, ఖత్రోచి, భట్నాగర్, మార్టిన్ లు మరణించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాందీపై నమోదైన అభియోగాలను 2004లో ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మరుసటి ఏడాది హిందూజా సోదరులపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. కుంభకోణం విలువ కన్నా కేసు దర్యాప్తుకయిన ఖర్చు ఎక్కువ అన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసు దర్యాప్తును సీబీఐ పక్కనపెట్టింది. అయితే దేశ ప్రజల దృష్టిలో బోఫోర్స్ కుంభకోణంపై సీరియస్ నెస్ తగ్గించేందుకు కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి కేసు పునర్విచారణ ద్వారా కాంగ్రెస్ కు ఉచ్చు బిగించాలని అధికార బీజేపీ భావిస్తోంది. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చేందుకు ఇంటెలిజిన్స్, సీబీఐని మోడీ, అమిత్ షా ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పై బోఫోర్స్ అస్త్రం ప్రయోగించేందుకు సిద్దమయ్యారన్నమాట.
మరిన్ని వార్తలు:
నంద్యాల ఓటు రేటెంత..?
ఏది వైష్ణవాలయం..? ఏది శివాలయం..?
శరద్ యాదవ్ పార్టీ పెడతారా..?