ఆంధ్రప్రదేశ్లో మరోసారి పడవ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.ఇటీవల వాడపల్లి దగ్గర గోదావరి నదిలో జరిగిన ఘోరం మరవక ముందే అదే గోదావరిలో మరో సారి పడవ మునక వేసింది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో నాటుపడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో నాటుపడవలో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. సుమారు 10 మందిని స్థానిక గ్రామస్తులు కాపాడినట్లు సమాచారం.
పశువుల్లంక నుంచి వలసలతిప్పకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి బయలుదేరారు. ఘటనాస్థలికి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం బయల్దేరారు. గజఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు.