Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికల తర్వాత ఉత్తరాంధ్రలో వైసీపీ ఏ మాత్రం కోలుకోలేకపోడానికి కారణం ఏంటి అన్న దాని మీద ఆ పార్టీ వ్యూహ బృందం జరిపిన సర్వేల్లో ఓ ఆసక్తికర అంశం బయటికి వచ్చిందట. కాంగ్రెస్ లో పెత్తనం చేసి పలు అవినీతి,అక్రమాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొత్స, ధర్మాన లాంటి నేతలు మళ్లీ వైసీపీ జెండా భుజాన వేసుకుని ముందుకు రావడం జనాలకి నచ్చడం లేదట. ఎక్కడికి వెళ్లినా వీళ్లేనా అన్న కోపంలో టీడీపీ తో సైద్ధాంతికంగా వ్యతిరేకించే వాళ్ళు సైతం బొత్స కి వ్యతిరేకంగా అధికార పార్టీని ఆశ్రయించారు. మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఎపిసోడ్ ఇందుకు పెద్ద ఉదాహరణ. అయినా నాయకత్వ లేమితో బాధపడుతున్న వైసీపీ వున్న వారిని కూడా దూరం చేసుకోవడం ఎందుకులే అని బొత్స వ్యవహారంలో చూసీచూడనట్టు పోతోంది.
బొత్స ని ఇలా భారంగా మోస్తున్న వైసీపీ కి ఇంకాస్త ఇబ్బంది పెరిగింది. తాజాగా ఈడీ కేసులో బొత్స పేరు వినిపించడంతో ఆయన పార్టీకి ఇంకా బరువు అనిపిస్తున్నాడు. హవాలా నిధుల తరలింపుకు సంబంధించి ప్రధాన నిందితుడు మొయిన్ ఖురేషీ తో పాటు ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, వైసీపీ నాయకుడు బొత్స పేర్లు వున్నాయి. జగన్ పాదయత్రకి ముందు ఇలా బొత్స పేరు ఇంకో అక్రమ కేసులో బయటికి రావడం వైసీపీ కి తలనొప్పిగా మారింది. అందుకే వీలైతే ఆయన్ని వదిలించుకోడానికి ఈ అవకాశాన్ని వాడుకోవాలని కొందరు జగన్ కి సలహా ఇచ్చారట. అదే జరిగితే బొత్స కి ఇక రాజకీయ ప్రత్యామ్న్యాయం కూడా లేనట్టే. అంటే ఓ రకంగా పొలిటికల్ కెరీర్ ఆగిపోయినట్టే. మొత్తానికి ఇప్పుడు బొత్స భవిష్యత్ జగన్ చేతుల్లో వుంది. ఆయన బొత్స అదనపు భారాన్ని మోస్తాడా, వదిలించుకుంటాడా అన్నదే ప్రశ్న.