Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పంతం నెగ్గించుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించినట్టుగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత ఎన్నికలు జరిగిన రోజు కాంగ్రెస్, బీజేపీ రెండూ గెలుపుపై ధీమా వ్యక్తంచేశాయి. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని సిద్ధరామయ్య చెప్పగా…యడ్యూరప్ప బీజేపీ విజయ సాధిస్తుందని, ఈ నెల 17న కర్నాటక సీఎంగా తాను ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు. యడ్యూరప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ…ఆయనకు మతి భ్రమించిందని సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు కూడా. అయితే ఇప్పుడు యడ్యూరప్ప చెప్పిన మాటలే నిజమయ్యాయి.
ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడిన అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో కూడా యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి..పంతం నెగ్గించుకున్నారు. అయితే యడ్యూరప్ప చెప్పిన కొన్ని మాటలు మాత్రం నిజం కాలేదు. బీజేపీ 140 నుంచి 150 స్థానాలు గెలుచుకుంటుందని, తాను 50వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని చెప్పారు. 17వ తేదీన తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవుతారని యడ్యూరప్ప జోస్యం చెప్పారు. కానీ ఆయన చెప్పినట్టుగా..
బీజేపీ 150 కాదుకదా..కనీసం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 112 స్థానాలు కూడా సంపాదించుకోలేకపోయింది. ఇక ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్ భవన్ లో సింపుల్ గా జరిగిపోయింది. అధ్యక్షుడు, ప్రధాని ఎవ్వరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. అయినప్పటికీ..బలనిరూపణ సంగతి పక్కనపెడితే…ఇప్పటివరకు బీజేపీ కాంగ్రెస్ ను అన్నివిధాలా దెబ్బకొట్టినట్టే. బీజేపీకి అధికారం దక్కకుండా చేయాలని ఎన్నికల ఫలితాల రోజే కాంగ్రెస్ తన సహజశైలికి భిన్నంగా అత్యంత దూకుడుగా వ్యవహరించి జేడీఎస్ కు మద్దతు ప్రకటించి….కూటమి ఏర్పాటుచేసినప్పటికీ మోడీ, షా వ్యూహాల ముందు చిత్తయిపోయింది.