Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన బాధిత ఏపీకి కేంద్రం నుంచి అందిన నిధులు, చేసిన సాయంపై పూర్తివివరాలు అందించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు జనసేనాని పెట్టిన డెడ్ లైన్ నిన్నటితో ముగిసిపోయింది. జేఏసీ ఏర్పాటు, నిజనిర్ధారణ కమిటీ వంటి నిర్ణయాలతో పవన్ కళ్యాణ్ దూకుడుగా వెళ్తున్నప్పటికీ…కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ఆయన్ను లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. డెడ్ లైన్ గడువు ముగిసిపోయినా…పవన్ అడిగిన వివరాలు అందించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. కొంతలో కొంత టీడీపీ నయం. పవన్ కళ్యాణ్ కోరినట్టుగా ఆయన చేతికి స్వయంగా వివరాలు అందిచకపోయినప్పటికీ…జనసేనాని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా స్పందించారు.
పవన్ పోరాటం సరైనదేనని, ఆయన అడిగిన వివరాలు అందించడం రాష్ట్రప్రభుత్వం బాధ్యతని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకు తగ్గట్టుగా మంత్రులు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు గురించిన సమాచారం మొత్తం పారదర్శకమేనని, వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్లలో ఉంటాయని చెప్పారు. బీజేపీ మాత్రం సాయం లెక్కలు అడిగిన పవన్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే అసలు ఏ అధికారంతో పవన్ ఈ వివరాలు కోరుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు మండిపడ్డారు. నిజానికి బీజేపీ నేతలే కాదు..రాజకీయ విశ్లేషకులు సైతం పవన్ వ్యాఖ్యలపై ఇదే రకం అభిప్రాయంవ్యక్తంచేశారు. .ఏ హోదాలో పవన్ నిధుల లెక్కలు అడుగుతున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.
అభిమానుల బలం చూసుకుని పవన్ తనను తాను ఎక్కువ ఊహించుకుంటున్నారని, రాజకీయాల్లో అభిమానగణం పనిచేయదని, పూర్తిస్థాయి పార్టీగా సైతం ఇంకా రూపాంతరం చెందని జనసేనానిగా పవన్ తన పరిధులేమిటో తెలుసుకుని ముందుకుపోతే మంచిదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే పవన్ మాత్రం తన దూకుడును కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తాను కోరిన స్పందన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాకపోవడంతో కార్యాచరణ ప్రారంభించారు. పవన్ రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా భావిస్తున్న జేఎఫ్ సీ సమావేశాల్లో పాల్గొనడానికి ముందు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పవన్ రాక సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. దీంతో మీడియాతో ఏమీ మాట్లాడకుండానే పవన్ వెళ్లిపోయారు. దస్ పల్లా హోటల్ రెండు రోజుల పాటు జరిగే జేఎఫ్ సీ సమావేశాల్లో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెస్ మాజీ నేతలు ఉండవల్లి అరుణ్ కుమార్, కొణతాల రామకృష్ణ, సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ. ప్రత్యేక హోదా సాధనసమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తో పాటు పలువురు రాజకీయ, సామాజిక, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, న్యాయనిపుణులు పాల్గొంటున్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విరుద్ద ప్రకటనలపైనే తొలిచర్చలు సాగనున్నాయి.