Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని నరేంద్రమోడీ సంగతి తిరుమల వెంకన్నే చూసుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష వేదికపై నుంచి చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం చేశారు. డీవీ మ్యానర్ నుంచి కాలినడకన ర్యాలీగా బెంజ్ సర్కిల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి ప్రజలతో ప్రతిజ్ఞ బూనుదాం, ప్రగతి సాధిద్దాం అన్న నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అన్నిరాష్ట్రాలు అవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నాయని, మనకు ఏమి ఇచ్చారని దినోత్సవాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. జూన్ 2 ఏపీ ప్రజలకు చీకటిరోజని, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు ద్రోహం చేస్తే బీజేపీ నమ్మకద్రోహం చేసిందని ఆ పార్టీని నమ్మి మోసపోయామని అన్నారు.
తిరుమల శ్రీవెంకటేశ్వరుని పాదాల చెంత నిలబడి, రాష్ట్రానికి చేస్తానన్న సాయం చేయని ప్రధాని నరేంద్రమోడీని ఆ స్వామే చూసుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెంకటేశ్వర స్వామి అపారశక్తులు ఉన్న దైవమని, తెలుగు ప్రజలకు అన్యాయం చేసే వారి అంతుచూస్తాడని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే 2019 ఎన్నికల్లో బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. ఏపీపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఒంటెద్దు పోకడలతో ఆనాడు రాష్ట్రాన్ని విభజించారని, తొలి ఏడాదిని రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రారంభించామని చెప్పారు. విభజన నష్టాన్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ముందుకొచ్చామని, దేశంలోనే ఏపీని నెం.1 రాష్ట్రంగా తయారుచేసే శక్తి, సామర్థ్యం తెలుగువారికి ఉందని వెల్లడించారు. అభద్రతాభావంతో ఉన్న ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
తొలిసారిగా గోదావరి,కృష్ణా నదులు అనుసంధానం చేశామని, పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు జూన్ లోనే నీళ్లు ఇచ్చామని చెప్పారు. 5 నదులను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చి భద్రత కల్పించాలన్నది తమ లక్ష్యమని వెల్లడించారు. పోలవరం పూర్తయ్యేంతవరకు విశ్రమించబోనని చంద్రబాబు శపథం చేశారు. ఢిల్లీ కంటే సుందర రాజధాని నిర్మించుకోవచ్చని స్వయంగా ప్రధాని చెప్పారని గుర్తుచేశారు. ఆనాడు ఇచ్చిన హామీని మర్చిపోయి గుజరాత్ లో దోలేరో నగరాన్ని నిర్మిస్తున్నారని… విభజన వల్ల నష్టపోయింది గుజరాత్ కాదని, ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కరారు. తెలుగు జాతికి రాజధాని నిర్మించాలన్నదే తన లక్ష్యమన్నారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రధాని కూడా భాగమవుతున్నారని చెప్పారు. నవనిర్మాణ దీక్షలు ఏడురోజుల పాటు జరుగుతాయని, ప్రజలంతా భాగస్వాములై సంఘటిత శక్తిచాటాలని పిలుపునిచ్చారు.