పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ తీరు మారడం లేదు ఆయన మరొకసారి వివాదంలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే మాజీ సర్పంచ్ మరియు వైఎస్ఆర్సిపి నేత కృష్ణారావు ఏలూరు నుంచి గార్లమడుగు వస్తుండగా దారి మధ్యలో కొందరు పోలవరం కుడికాలువ గట్టు మట్టిని యంత్రాలతో తవ్వి టిప్పర్లలో పోస్తుండటం కనిపించింది. ఆయన పోలవరం ఎస్‌ఈకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆయన డీఈని పంపిస్తానని అక్కడే ఉండమని చెప్పారు.
అయితే ఇంతలో ఆ ప్రభుత్వ అధికారి కంటే ముందుగానే అక్కడికి ఎమ్మెల్యే అనుచరులు చేరుకున్నారు. వీరు కృష్ణారావు పై దాడి చేసి, కారులో ఎక్కించుకొని ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యే చింతమనేని కూడా కృష్ణారావు పై దాడి చేశాడు. దాడి అనంతరం కృష్ణ రావు ని తీసుకొచ్చి బయట వదిలేసి వెళ్ళిపోయారు. దీంతో కృష్ణ రావు పోలీసులను ఆశ్రయించి ఎమ్మెల్యే పై అతని అనుచరులపై కిడ్నాప్ మరియు దాడి చేసినందుకుగాను కేసు పెట్టారు.
ఆ కేసు సంగతి పక్కన పెడితే టీడీపీయేతర నాయకులు, కార్యకర్తలే అనుకున్నాం సొంత పార్టీ వారైనా తన తీరు అదేనని ప్రభాకర్ నిరూపించారు. టీడీపీ నాయకుడిపైనే ఏకంగా దాడికి దిగి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి పరిస్థితి ఎదురు తిరగడంతో గ్రామస్థులకు క్షమాపణ చెప్సాల్సి వచ్చింది. పెదపాడు మండలం దాసరిగూడెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి చింతమనేని హాజరయ్యారు. సభకు దాసరిగూడెం తాజా మాజీ సర్పంచ్ పామర్తి పెదరంగారావు కూడా హాజరయ్యారు. ఓ వ్యక్తికి ఉపాధి రుణం మంజూరు అంశం సభలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. ‘వాడికి రుణం మంజూరు చేయాలని నీకెవడు సిఫార్సు చేయమన్నాడు?, గ్రామంలో నాకు తెలియకుండా పింఛన్లు ఎందుకు మంజూరు చేయిస్తున్నావ్?’ అంటూ అసభ్య పదజాలం అందుకున్నారు. రంగారావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోకుండా అతనిపై చెయ్యి చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రంగారావు వెంటనే అక్కడి నుంచి తన స్వగ్రామమైన వేంపాడు వెళ్లిపోయారు.
విషయం గ్రామస్థులకు చెప్పడంతో వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రామంలో ఏర్పాటుచేసి ఉన్న పార్టీ ఫ్లెక్లీలను తగుబెట్టారు. కాసేపటికి గ్రామదర్శిని కార్యక్రమం ముగించుకుని వస్తున్న చింతమనేని వాహనాన్ని అడ్డుకున్నారు. క్షమాపణ చెబితేగాని కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. దీంతో చింతమనేని ఓ మెట్టు దిగి ‘రంగారావు నాకు తమ్ముడి లాంటివాడు, ఏదో ఆగ్రహంలో అలా చేశాను’ అని సంజాయిషీ ఇచ్చినా గ్రామస్థులు సంతృప్తి చెందలేదు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే, రంగారావుకు మూడు సార్లు క్షమాపణ చెప్పారు. ఈలోగా విషయం తెలుసుకుని గ్రామానికి వచ్చిన పోటీసుల సాయంతో ఊరి నుంచి బయటపడ్డారు. చింతమనేని మీద ఇప్పటి నుండే కాదు ఎప్పటి నుండో ఆయన తీరుపై ఎప్పటినుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇసుక మాఫియాను నడపడం అడ్డొచ్చిన అధికారులను కొట్టడం, ప్రజలను కులం పేరుతో దూషించడం, నియోజకవర్గంలో పలువురి మీద దాడి చేయడం లాంటి ఎన్నో విమర్శలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి వీడియో ఆధారాలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
కానీ చింతమనేని పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు. అయితే కాస్త ఆలస్యంగా అయినా చింతమనేని ప్రభాకర్ తీరుపై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పుకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్ ఉంటుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.