Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పాతగుంటూరు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీఇచ్చారు. గత అర్ధరాత్రి పాత గుంటూరులో రఘు అనే 20 ఏళ్ల యువకుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. బాలాజీ నగర్ లోని ఓ ప్రాంతంలో ఉండే బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రఘు.. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించి ఆమెపై అత్యాచారం జరపబోయాడు. వెంటనే ఆ బాలిక కేకలు వేస్తూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులతో జరిగిన విషయం చెప్పింది. దీంతో స్థానికులు రఘును పట్టుకునేందుకు వెంబడించారు. దీంతో అక్కడినుంచి పారిపోయిన రఘు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో రహదారులపైకి చేరి ఆందోళనకు దిగారు. మరికొందరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
రంగంలోకి దిగిన పోలీసు అధికారులు అదనపు బలగాలను మోహరించినప్పటికీ…ఆహ్రావేశాలతో ఉన్న నిరసనకారులు నూతనంగా నిర్మించిన ఆదర్శ పోలీస్ స్టేషన్ పై రాళ్లవర్షం కురిపించారు. దీంతో స్టేషన్ అద్దాలు పగిలాయి. వారిని నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. రాళ్లదాడిలో 22 మంది పోలీసులకు గాయాలయ్యాయని, పలు పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు చెప్పారు . ఈ ఘటనలపై సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులతో చంద్రబాబు తన నివాసంలో సమీక్ష జరిపారు. ఆడబిడ్డలకు అన్యాయంచేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఒకరిద్దరిని కఠినంగా శిక్షిస్తే మిగిలిన వారికి బుద్ధివస్తుందనది సీఎం అభిప్రాయపడ్డారు. ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలన్న ప్రచారం విస్తృతంగా జరగాలని..నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయన్న ఇంగితం ప్రజల్లో పెరగాలని హితబోధ చేశారు. పాత గుంటూరులో పరిస్థితులను గురించి వాకబు చేసిన సీఎం చంద్రబాబు అశాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అశాంతి, అభద్రత సృష్టిస్తే…కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.