Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు అవుతున్నా ఇంకా తెలంగాణ, ఆంధ్ర మధ్య అక్కడక్కడా విభేదాలు, వైరుధ్యాలు పొడసూపుతునే వున్నాయి. అందుకు ఓ పెద్ద ఉదాహరణ ఇటీవల హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా జరిగిన “ప్రపంచ తెలుగు మహాసభలు”. ఈ సభల కోసం దేశవిదేశాల ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన కెసిఆర్ సర్కార్ పక్కనున్న ఇంకో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుని మాత్రం మర్చిపోయింది. మేము పిలవాలి అనుకున్నా బాబు బిజీగా ఉంటారని తెలుసుకుని పిలవలేదని ఓ వివరణ కూడా ఇచ్చింది అనుకోండి. అందుకే గరికపాటి నరసింహారావు లాంటి రచయితలు ఆ సభలకు పిలుపు వచ్చినా వెళ్లకుండా తమ ఆక్షేపణ తెలిపారు. ఇదంతా జరిగి ఇంకా నెల రోజులు అయినా గడవకముందే ఓ చిత్రమైన సంఘటన కి విజయవాడ వేదిక అయ్యింది.
విజయవాడలో ఓ భారీ బుక్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ పుస్తక ఉత్సవాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా స్పాన్సర్ చేసినవారిలో ఒకటి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ బుక్ ఫెస్టివల్ సందర్భంగా కవుల్ని సత్కరించాలని నిర్ణయించారు. అయితే ప్రపంచ తెలుగు మహాసభల అనుభవంతో తెలంగాణ కవులకు ఆహ్వానాలు ఉండవని అంతా భావించారు. ఆ అంచనాలు తల్లకిందులు చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కవులు, రచయితలకు పిలుపులు బాగానే వెళ్లాయి. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ కి ఆహ్వానం అందడం ఆశ్చర్యం కాకపోయినా సాక్షి ఎడిటర్ రామచంద్రమూర్తికి పిలుపు వెళ్లడం షాకింగ్. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో “మీ మొహం మీద పువ్వులుంటాయి… మనసులో ముళ్లుంటాయి” అని కవితలు రాసిన స్కై బాబా లాంటి రచయితకు కూడా పిలుపు వచ్చింది. సత్కారం కూడా అందింది. మొత్తానికి కెసిఆర్ పిలవకపోయినా బాబు పిలిచి మరీ సత్కరించడం చూసి కొందరు ఆంధ్ర వాళ్ళు అంత అవసరం ఏంటని ప్రశ్నిస్తుంటే, ఇంకొందరు మాత్రం పెద్దరికం నిలుపుకున్నారని సీఎం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.