బాబుకు అవిస్వాసం మీదే విశ్వాసం !

Cm chandrababu discuss about antitrust resolutions

జులై 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సభలోను, బయట ఎంపీలు చేయాల్సిన పోరాటంపై సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలతో నిన్న అర్ధరాత్రి వరకు భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో రాబోయే వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. కేంద్రంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్రతరం చేయాలని బాబు పిలుపునిచ్చారు. ఢిల్లీలో మిగిలిన ప్రతిపక్షాల నేతలను ఎంపీలను కలిసి ఏపీకి మద్దతు కోరాలని తాను కూడా విపక్ష నేతలకు ఫోన్‌ చేసి సంఘీభావం ప్రకటించాలని కోరతానని తెలిపినట్టు సమాచారం అందుతోంది.

టీడీపీ ఎంపీలు బృందాలుగా ఏర్పడి, అన్ని రాష్ట్రాలకు వెళ్లి బీజేపీ, కాంగ్రెస్‌ మినహా ఇతర అన్ని పార్టీల ఎంపీలను కలవాలని నిర్ణయించారు. 5 కోట్ల ప్రజల దృష్టి టీడీపీ ఎంపీల పోరాటంపైనే ఉన్నందున అందుకు తగ్గట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సభలో అవిశ్వాస తీర్మానం మళ్లీ పెట్టాలని, తమకు 50మంది సభ్యుల మద్దతుకు ఢోకా లేదని బాబు అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జాతీయ అజెండాగా మార్చాలని, ఏపీకి జరిగిన అన్యాయంపై పుస్తకం రూపొందించాలని సూచించారు. బీజేపీకి మేలు చేసేందుకే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల మైనారిటీలో పడే ప్రమాదం నుంచి బీజేపీ బయటపడిందని అన్నారు. వైసీపీ పారిపోయిందని, రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందని బాబు విమర్శించారు. పోరాడే సమయంలో పారిపోయారని ఎద్దేవా చేశారు.