Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల మీద సమీక్ష జరిపేందుకు విజయవాడలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ అధ్యక్షతన సమావేశం అయిన కాంగ్రెస్ నాయకులు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఏపీ లో కాంగ్రెస్ కి పూర్వ వైభవం రావాలంటే ముందుగా మన ఓట్లు తీసుకెళ్లిన వైసీపీ ని దెబ్బ తీయడం మీద ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. ఒకప్పుడు జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలోని లోక్ సత్తా కూడా ఇదే వ్యూహంతో వెళ్లి 2009 లో టీడీపీ ఓటమికి బాటలు వేసింది. అప్పట్లో దాదాపు 20 నుంచి 30 స్థానాల్లో లోక్ సత్తా అభ్యర్థి సాధించిన ఓట్ల కన్నా కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ తక్కువగా వుంది. వచ్చే ఎన్నికల నాటికి అదే వ్యూహంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించడం నిజంగా వైసీపీ కి పెద్ద దెబ్బే.
అయితే కాంగ్రెస్ మాట అన్నంత తేలిగ్గా లేదు అసలు పరిస్థితి. ఈ తీర్మానం చేసిన సమావేశంలో పాల్గొన్న నాయకులు చాలా మంది వేదిక దిగగానే వైసీపీ అధినేత జగన్ కి మేలు చేయాలని చూస్తున్న వాళ్ళే. ఆయనకి ఫోన్ చేసి రాజకీయ సలహాలు,సూచనలు ఇస్తున్న వాళ్ళే. కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యూహం వేయడం కన్నా దాన్ని అమలు పరచడం చాలా కష్టం అనే చెప్పుకోవాలి. అయితే కాంగ్రెస్ కూడా మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇలా తీర్మానం చేసింది అనే వాళ్ళు కూడా లేకపోలేదు. జగన్ మీద ఒత్తిడి పెంచడం ద్వారా కాంగ్రెస్ తో పొత్తుకు ఆయనే ముందుకు వచ్చేలా చేయాలని 10 జన్ పథ్ భావిస్తోందని కూడా ఓ వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ లక్ష్యం ఏదైనా అది బయటకు వినిపిస్తున్న మాట ప్రస్తుతానికి వైసీపీ కి వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది.
మరిన్ని వార్తలు: