Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాహుబలి కన్ క్లూజన్ తర్వాత ఖాళీగా ఉంటున్న రాజమౌళి విడుదలైన సినిమాలన్నింటినీ చూస్తూ తన అభిప్రాయం తెలియజేస్తున్నారు.హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలపై తనదైన శైలిలో పొగడ్తలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాల గురించి మాత్రం రాజమౌళి ఒక్క మాట కూడా మాట్లాడరు. వరుసగా సినిమాలు చూసే రాజమౌళి కొన్నిరోజులగా ఏ సినిమా గురించీ స్పందించలేదు. దీనికి కారణం టాలీవుడ్ కు ఈ మధ్య కాలంలో మంచిహిట్ లేకపోవడమే. తాజాగా రిలీజయిన తొలిప్రేమ ఆ లోటు తీర్చింది. బాబాయ్ తొలిప్రేమకు తగ్గట్టే అబ్బాయ్ తొలిప్రేమ కూడా ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ తెచ్చుకుని అందరి ప్రశంసలూ అందుకుంటోంది.
ఫిదా తర్వాత వరుణ్ తేజ్ కు మరో భారీ హిట్ గా నిలుస్తోంది. ఎప్పటిలానే రాజమౌళి కూడా హిట్ టాక్ వచ్చిన ఈ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు. అంతర్జాతీయస్థాయిలో బాహుబలి వంటి సినిమాలను తీర్చిదిద్దిన రాజమౌళి తన 17 ఏళ్ల కెరీర్ లో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ప్రేమకథల జోలికి పోలేదు. అలాగే ఆయన సినిమాల్లో ఆ తరహా సన్నివేశాలు కూడా ఎక్కువ ఉండవు. దీనికి కారణం ఆయన ప్రేమకథా చిత్రాలకు అభిమాని కాకపోవడమేనట. ఈ విషయాన్ని తొలి ప్రేమ చూసిన తర్వాత రాజమౌళే స్వయంగా వెల్లడించారు. తాను ప్రేమ కథలకు అభిమాని కాదు కానీ…తొలిప్రేమ చిత్రాన్ని మాత్రం ఆస్వాదిస్తున్నానని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. చిత్రయూనిట్ పైనా ప్రశంసల జల్లు కురిపించారు. వెంకీ తన తొలిచిత్రమే చాలా చక్కగా తీశాడని, వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కాడని, అతని బలం పెరిగిందని ప్రశంసించారు. హీరోయిన్ రాశిఖన్నాను జక్కన్న అభినందించారు. సినిమాలో రాశి ఖన్నా అందంగా కనపడిందని, ఆమె అభినయం కూడా బాగుందని రాజమౌళి కామెంట్ చేశారు. ప్రసాద్, బాపినీడు నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయని, మంచి నిర్మాణ విలువలతో తీసి విజయానికి అన్ని విధాలా అర్హత ఉందని నిరూపించారని రాజమౌళి కొనియాడారు.