తేలిన జగన్ కత్తి విషం విషయం…అసలు విషం ఎందుకంటే…!

Doctors Report On AP Leader Of Opposition YS Jagan Blood Samples
విశాఖపట్నం విమానశ్రయంలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై ఓ వ్యక్తి కోడి పందేలలో ఉపయోగించే కత్తితో దాడి చేసిన సంఘటన విదితమే. అయితే ఈ దాడిలో జగన్ భుజానికి గాయం అయింది. జగన్ కు ఎతువన్తిఒ ఆరోగ్య సమస్యలు ఎదురు కాక పోయినా కానీ దాడి జరిగింది కోడి పందేలలో ఉపయోగించే కత్తి కావటంతో విషం పూశారేమోననే అనుమానం దాదపు అందరూ వ్యక్తం చేయడంతో జగన్ బ్లడ్ శాంపుల్స్‌ను సేకరించి డాక్టర్లు ల్యాబ్‌‌కు పంపారు. తాజాగా బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ వచ్చిందని వైద్యులు తెలిపారు. జగన్ రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు.
jagan-blood
ఆ కత్తికి విషం పూసారో లేదో ఈ క్షణం ముందు వరకూ తెలియదు గానీ రాజకీయ విషాన్ని మాత్రం ఎవరి స్థాయిలో వాళ్ళు పూసేస్తున్నారు. ఈ విష సంస్క్రతి జోలికి నేను పోదల్చుకోలేదు. కాకపోతే ఈ కత్తి గురించి తెలియని వాళ్ళ కోసం నాకు తెలిసింది పంచుకోవాలనుకుంటున్నాను. సంక్రాంతి వస్తే చాలు ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందాల సందడి మొదలవుతుంది. అలాంటి సమయంలోనే పుంజుల కాళ్ళకి కట్టే కత్తులకి డిమాండ్ ఉంటుంది. ఈ కత్తుల్ని అందరూ కట్టలేరు. సపరేటుగా వీటికోసం కొన్ని కుటుంబాలు ఉంటాయ్. ఆ సీజన్ లో వీళ్ళకి ఇదే చక్కటి వ్యాపారం. ఏ పుంజుకి ఏ కత్తి కట్టాలో వీళ్ళకి బాగా తెలుసు. కట్టిన కత్తి ఎదుట ఉన్న పుంజు గుండెల్ని చీల్చేలా జాగ్రత్తగా కడతారు. ఈ కత్తి కట్టు ఆధారంగానే గెలుపు కూడా కీలకమవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే పందెం రాయుళ్ళు సెంటుమెంట్ తో నిష్ణాతులైన ‘కత్తుల రత్తయ్య’లతో కత్తులు కట్టించి వారికి మంచి పారితోషికం ఇస్తారు. నూటికో కోటికో కత్తులకి విషం కూడా పూస్తారన్న టాక్ కూడా ఉంది. కానీ అది నిజం కాదని నా నమ్మకం ఎందుకంటే ఎన్నో పందాలను దగ్గరనుండి చూసి, పర్యవేక్షించిన ఒక గోదావరి జిల్లా బిడ్డగా చెబుతున్నాను ఈ విషం పూసి కత్తులు కడతారు అనేది నిజం కాదు. ఎందుకంటే ఆ పందెంలో చనిపోయిన కోడి పుంజులని చాలా ఇష్టంగా తింటారు గోదావరి జిల్లాల ప్రజలు.
jagan-hospital
పందెంలో ఓడిన కోడిని కోజ అంటారు. అయితే ఆ పందెం కోడిని సుమారు సంవత్సం నుండి రెండేళ్ళ పాటు పెంచిన తీరును, దానికి అందించిన ఆహారం గురించి తెలిస్తే పందెపు పుంజుపై మనిషికే ఈర్ష్య కలగక మానదు. పందాలను సిద్ధం చేసే పుంజులను ఒక ప్రత్యేక తరహాలో పెంచుతారు. వాటికి రోజువారీ ఆహారంగా ప్రారంభలో నూకలు, తవుడు, రాగులు, చోళ్ళు, గోదుమలు అందిస్తారు. అనంతరం పందెపు పుంజు లక్షణాలు కలిగిన వాటిని గుర్తించి పుంజులకు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు, మేక కైమా, కోడి గుడ్లను ఆహారంగా అందిస్తారు. అంతేకాదు ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయిస్తారు. ఈప్రక్రియ కోడిపందాలకు ఆరు నెలల ముందు నుండే నిర్వహిస్తామని పెంపకందార్లు చెపుతున్నారు. అటువంటి కోడి పుంజులను ఆషామాషీ పందాలకు ఉపయోగించరు. అలా పెంచి పోషించిన కోడి పుంజులపై పందాలు లక్షలు, కోట్లలో జరుగుతాయి.
cocks
బరిలోకి దిగిన పుంజులకు కత్తులు కట్టడంవల్ల వాటిలో ఏదో ఒకటి నేల కొరగడం సహజం. ఓడిన పుంజును కోజగా నిర్ధారించి, విజేత పుంజులు వైద్యం చేయించి మళ్ళీ పందాలకు సిద్ధం చేస్తారు. అయితే పందెంలో ఓడిన పుంజు మాంసం కోసం మాంసహారులు ఎందుకు ఎగబడతారో ఇప్పటికైనా అర్ధమయ్యే ఉండాలి. పందాల్లో ఓడిన పుంజుల ఖరీదు ఏమంత తక్కువ అనుకుంటే పొరపాటే. ఓడిన పుంజును రూ.5 వేల నుండి 10 వేల వరకూ మాంసాహార ప్రియులు కొంటారంటే దాని రుచిని చెప్పకనే చెప్పొచ్చు. ఇక సాధారణ కోజలైతే రూ. 2 వేలు నుండి 4 వేల మద్య కొనుగోలు చేసారు. నిజంగా విషాలు పూసి పందాలు వేసే సంస్కృతి అయితే ఇప్పుడు లేదనే చెప్పాలి, అది మన తరం వాళ్ళు పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో చూసి ఉండవచ్చు అంత మాత్రాన ఆ విషం పూసి దాడి చేశాడు అనుకోవడం నిజంగా పిచ్చితనమే. పందెం గ్రౌండ్ లో కనిపించే ఈ కత్తి ఎయిర్ పోర్ట్ దాకా రావడం. ఆ కత్తికి రాజకీయ విషాన్ని పూయడం దురదృష్టకరం. అది ఏ పార్టీ వారు మాట్లాడినా సరే.
jagan-mohan-reddy