విజయ్ దేవరకొండ, పరుశురామ్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘గీతగోవిందం’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మొదట 20 కోట్ల వసూళ్లు చేస్తే చాలు అని నిర్మాతలు అనుకున్నారు. సినిమా విడుదలై మొదటి వారంలోనే భారీగా వసూళ్లను రాబట్టిన నేపథ్యంలో భారీ ఎత్తున ఈ చిత్రం లాంగ్ రన్ వసూళ్లు ఉంటాయని అంతా ఊహించారు. కాని విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత ట్రేడ్ వర్గాల వారు 50 కోట్లు ఈ చిత్రం వసూళ్లు చేస్తుందని ఊహించలేదు. 30 నుండి 40 కోట్ల వరకు ఈ చిత్రం వసూళ్లు సాధించి ఆగిపోవచ్చు అనుకున్నారు. కాని అందరి అంచనాలను తారు మారు చేస్తూ రికార్డు స్థాయిలో ఈ చిత్రం వసూళ్లు సాధిస్తూ వచ్చింది.
50 కోట్లు కష్టం అనుకుంటే ఈ చిత్రం సునాయాసంగా 50 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత 60 కోట్ల క్లబ్లో చేరక పోవచ్చు అనుకున్నారు. కాని 25 రోజులు ముగిసే సమయానికి ఈ చిత్రం 60 కోట్లకు చేరింది. తాజాగా ఈ చిత్రం 70 కోట్లకు చేరువలో ఉంది. 67 కోట్ల వసూళ్లను నిన్నటి వరకు దక్కించుకున్న ఈ చిత్రం శైలజ రెడ్డి అల్లుడు వచ్చేప్పటికి 70 కోట్లను వసూళ్లు చేయనుందని, లాంగ్ రన్లో ఈచిత్రం మరో అయిదు కోట్లు వసూళ్లు చేసి మొత్తంగా 75 కోట్ల వద్ద క్లోజ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఒక చిన్న హీరో చిత్రం, ఏమాత్రం గుర్తింపు లేని దర్శకుడు తెరకెక్కించిన చిత్రం 75 కోట్ల వసూళ్లను రాబట్టడం అనేది చిన్న విషయం కాదు. ఈ ఫీట్ కేవలం గీత గోవిందంకే దక్కింది.