Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినీ పరిశ్రమలో మహిళలపై లైంగికవేధింపుల గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా… భారత్ లో నటీమణులు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. మరికొందరు హీరోయిన్లయితే తామెలాంటి సమస్యలూ ఎదుర్కోలేదని కూడా చెప్పారు. రిచా చద్దా, కంగనారనౌత్, స్వరా భాస్కర్ వంటి ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు మాత్రమే తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి మీడియా ముందు ప్రస్తావించారు. దీనికి గల కారణాన్ని హీరోయిన్ ఇలియానా వివరించింది. దక్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్లిన ఇలియానా… కొన్నిరోజుల క్రితం… టాలీవుడ్ పై తీవ్రవిమర్శలు గుప్పించింది. దక్షిణాది చిత్రపరిశ్రమ తనను అందాల వస్తువుగా వాడుకుందని తీవ్ర వ్యాఖ్యలుచేసిన ఇలియానా… ఇప్పుడు బాలీవుడ్ పైనా విమర్శలు గుప్పించింది. తన తాజా హిందీ చిత్రం రైడ్ ప్రమోషన్ సందర్భంగా బాంబే టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ సినిమా ప్రపంచపు చీకటికోణం గురించి పెదవి విప్పింది. అదేసమయంలో తనకు ఎదురయిన అనుభవాల గురించిమాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
సినీ పరిశ్రమలో లైంగిక హింస గురించి బహిరంగంగా ప్రశ్నించే తారల కెరీర్ ముగిసిపోతుందా అన్న ప్రశ్నకు… ప్రశ్నించకపోవడం పిరికితనమవుతుందని… అయితే వేధింపులకు గురయిన వారు దాన్ని బయటపెడితే ధైర్యవంతులు అనొచ్చు కానీ… ఆ తర్వాత వారి కెరీర్ అక్కడితో ముగిసిపోతుందని, అందుకే నటీమణులు దీని గురించి బహిరంగంగా మాట్లాడరని ఇలియానా తెలిపింది. చాలా ఏళ్ల కిందట దక్షిణాదిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఓ బడా నిర్మాత నుంచి తనకు ఎదురయిన ఇదేరకమైన ఇబ్బంది గురించి తన సలహా కోరిందని, ఆమెకు తానేమీ చెప్పలేకపోయానని, ఆమె సొంతనిర్ణయానికే వదిలేశానని ఇలియానా చెప్పుకొచ్చింది. తనకు సంబంధించినంత వరకు లైంగిక దోపిడీ, వేధింపులకు తాను పూర్తి వ్యతిరేకమని ఆమె స్పష్టంచేసింది. ఈ దేశంలో నటీనటుల్ని పూజిస్తారని, అలాంటి వారికి ఇలాంటి చెత్త సమస్యలు ఉంటాయని తెలియజేయడానికి చాలా మంది నటీనటులు ఏకమవ్వాలని కోరింది.