కాలు జారితే తీసుకోవచ్చు నోరు జారితే వెనక్కి తీసుకోలేమనేది పాత మాట, ఇప్పుడు కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు సోషల్ మీడియాలో పోస్టు జారితే వెనక్కు తీసుకోవడం కష్టం అని చెప్పుకునే రోజులు వచ్చేశాయి. తాజాగా ఇలా ఒక పోస్టు జారిన వ్యక్తి ఏకంగా తన ఉద్యోగ పోస్టుకి స్వయానా ఎసరు పెట్టుకున్నాడు. భారీ వరదలతో కేరళ అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఆ వరదలలో చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖుల దగ్గర్నుంచి సామాన్యుల వరకు ముందుకొస్తున్నారు. తమకు తోచినంత సాయం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.
కానీ అదే రాష్ట్రానికి చెంది గల్ఫ్‌లో పనిచేస్తున్న చెందిన ఓ వ్యక్తి సొంత రాష్ట్రం వరదల పరిస్థితిపై అసభ్యకరమైన ట్వీట్ చేశాడు. ఫలితంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. వివరాలలోకి వెళితే కేరళకు చెందిన రాహుల్ పళయట్టు ఒమన్‌లోని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కేరళలో వరదల నేపథ్యంలో బాధితులకు అండగా సోషల్‌మీడియాలో ఒక వ్యక్తి ఇటువంటి అత్యవసర సమయంలో మహిళలకి ఎంతో అవసరమైన ‘శానిటరీ నాప్‌కీన్లు’ కూడా అందిస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్ పోస్టు చేశారు. ఈ పోస్టుకు స్పందించిన రాహుల్ ‘కండోమ్‌లు కూడా అవసరమే’ అంటూ ఒళ్ళు కొవ్వేక్కిన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్ అయ్యింది అందరూ అతని మీద దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు.
దీంతో విషయం తెలుసుకున్న అతను పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం అతడిని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ‘రాహుల్ సోషల్‌మీడియాలో చేసిన అసభ్య కామెంట్ల నేపథ్యంలో అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ ప్రకటించారు. దీంతో ఆత్మరక్షణలో పడ్డ రాహుల్ ఆ సమయంలో నేను మద్యం సేవించి ఉన్నానని ఏం మాట్లాడుతున్నానో సోయ లేదని జరిగిందానికి క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పుకొచ్చాడు, కానీ కంపెనీ మాత్రం అతని మాటలని పట్టించుకోలేదు ఫలితంగా సోషల్ మీడియాలో పోస్టు జారి, జాబ్ పోస్టు పోగొట్టుకున్నాడు.