ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల పార్థీవ దేహానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం కోసం సీఎం జగన్ నిన్నన సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన ఇక ఈ ఉదయం లోటస్‌పాండ్ నుంచి నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి వెళ్ళిన జగన్ ఉదయం 9గంటలకు విజయనిర్మల భౌతిక కాయాన్ని సందర్శించారు. విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. తెలుగు సినిమా రంగానికి విజయనిర్మల చేసిన సేవలను స్మరించుకున్న ఆయన కృష్ణ, నరేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ వెంట , ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు ఉన్నారు. కడసారి చూపు కోసం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణ నివాసానికి తరలివస్తున్నారు. విజయ నిర్మల పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గత ఏడునెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదరాబాద్ గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి తర్వాత తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం 11గంటలకు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అభిమానుల సందర్శనార్ధం నేడు ఆమె పార్ధివ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించి, అక్కడ కొద్ది సేపు ఉంచుతారు. తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి చిలుకూరులోని ఫాంహౌస్ వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తారు. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.